Reading Time: 2 minutes
Cm Chandrababu Reviews Preparations For 31st Cii Partnership Summit 2026 In Visakhapatnam

CM Chandrababu: నవంబర్ నెలలో నిర్వహించనున్న 31వ సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) పార్టనర్‌షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, నారాయణ, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్‌తో పాటు సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజీత్ బెనర్జీ, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. “నేవిగేటింగ్ చేంజ్: లీడర్‌షిప్, టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ ట్రేడ్ ఇన్ ఎ ట్రాన్స్‌ఫార్మింగ్ వరల్డ్” అనే థీమ్‌తో ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సు జరగనుంది. ప్రధాన సదస్సుకు ముందు విశాఖపట్నం, రాజమండ్రి లేదా కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతిలలో ప్రాంతీయ భాగస్వామ్య సమావేశాలు నిర్వహించే అంశంపై కూడా చర్చ జరిగింది. ఈ సమావేశాల ద్వారా వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులను భాగస్వామ్య సదస్సుకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఎంఓయూలు, మినిస్టీరియల్ సెషన్లు, ప్లీనరీ సమావేశాలు, దేశాల వారీగా ప్రత్యేక సెషన్లు, బీ2బీ (బిజినెస్ టు బిజినెస్), బీ2జీ (బిజినెస్ టు గవర్నమెంట్) సమావేశాలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, విదేశీ ప్రతినిధి బృందాలను విశాఖ సదస్సుకు ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. సదస్సుకు విస్తృత ప్రచారం కల్పించేందుకు జూలై నుంచి సెప్టెంబర్ వరకు దేశ, విదేశాల్లో రోడ్ షోలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, కోయంబత్తూర్, అహ్మదాబాద్, హైదరాబాద్ నగరాల్లో ప్రత్యేక రోడ్ షోలు చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విశాఖలో జరగబోయే పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో కేవలం పెట్టుబడులు, వ్యాపార అవకాశాలపైనే కాకుండా పబ్లిక్ పాలసీలు, వినూత్న ఆలోచనలు, భవిష్యత్ అభివృద్ధి దిశలపై కూడా విస్తృత చర్చలు జరగాలని సూచించారు. ప్రాంతీయ సదస్సుల్లో కూడా ఎంఓయూలు కుదుర్చుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. వ్యవసాయం, ఉద్యానరంగం, ప్రకృతి వ్యవసాయం, సర్క్యులర్ ఎకానమీ, ఆధ్యాత్మికత, స్ట్రెస్ ఫ్రీ వర్క్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు. పెట్టుబడుల విలువ, ఎంఓయూల సంఖ్య కంటే నాలెడ్జ్ షేరింగ్ ఎంత మేరకు జరిగిందన్నదే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

భాగస్వామ్య సదస్సులో జరిగే చర్చలు ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించేలా ఉండాలని, ఫ్యూచరిస్టిక్ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చంద్రబాబు సూచించారు. అలాగే ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు చెందిన నిపుణులు సదస్సులో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అమరావతిలో సీఐఐ గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కేంద్రం భవిష్యత్ నాయకత్వం, ఆవిష్కరణలు, ప్రపంచ స్థాయి విధాన చర్చలకు వేదికగా నిలవనుందని అధికారులు తెలిపారు.