Reading Time: < 1 minute

ఇందిరమ్మ ఇండ్ల స్లాబ్పై పరిమితి విధింపు ఉత్తర్వులు జారీ చేసిన ..హౌసింగ్ సెక్రటరీ వీపీ గౌతమ్

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులు అప్పులపాలు కాకుండా చూసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండ్ల పైకప్పు (స్లాబ్)పై పరిమితులు విధిస్తూ హౌసింగ్ శాఖ సెక్రటరీ వీపీ గౌతమ్ జీవో జారీ చేశారు. అవసరం లేకున్నా స్లాబ్ పరిధిని ఇష్టారీతిన పెంచుకుంటూ లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందుల్లో పడుతుండడంతో సర్కార్ ఈ నిబంధనలు తెచ్చింది. క్షేత్రస్థాయిలో స్లాబ్ పరిధిని పొడిగించకుండా చూడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.

చాలా చోట్ల మేస్త్రీలు, ఇతరుల మాటలు విని లబ్ధిదారులు స్లాబ్ ఏరియాను భారీగా పెంచేస్తున్నారు. మేస్త్రీలు చదరపు అడుగు నిర్మాణానికి రూ.250 చొప్పున కాంట్రాక్ట్ మాట్లాడుకుంటారు. స్లాబ్ ఎంత పెద్దదైతే తమకు అంత ఎక్కువ కూలీ వస్తుందనే ఆశతో, లబ్ధిదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అనవసరంగా సైజు పెంచుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి ఏఈలు తీసుకెళ్లడంతోనే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

కొత్త రూల్స్ ఇవే..

  • ఇంటి అసలు విస్తీర్ణానికి (ప్లింత్ ఏరియా) కేవలం 25% అదనంగా స్లాబ్ వేసుకోవాలి.
  • 400 చదరపు అడుగుల ఇండ్లకు గరిష్టంగా 500 చదరపు అడుగుల వరకు మాత్రమే 
  • 600 చదరపు అడుగుల ఇండ్లకు 750 చదరపు అడుగుల వరకే స్లాబ్ వేయాలి.
  • తలుపులు, కిటికీల రక్షణకు స్లాబ్‌ను సాగదీయకుండా కేవలం సన్‌షేడ్లు (సబ్జాలు) మాత్రమే పెట్టుకోవాలి.
  • కొత్త రూల్స్​ ప్రస్తుతం స్లాబ్ పనులు కాకుండా ఉన్న ఇండ్లకు, బేస్‌మెంట్, పిల్లర్ల దశల్లో ఉన్న నిర్మాణాలకు ఈ వర్తిస్తాయి. 
©️ VIL Media Pvt Ltd.