
ఏపీ ప్రభుత్వం మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు వేగవంతంగా పౌర సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాట్సప్ గవర్నెన్స్ సదుపాయం తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రభుత్వ సర్టిఫికేట్లు వేగవంతంగా పొందటంతో పాటు ఛలాన్లు, బిల్లులు వంటివి చెల్లించవచ్చు. అన్ని శాఖలకు సంబంధించిన సేవలు డిజిటల్ విధానంలో ఇందులో పొందవచ్చు. అయితే ప్రభుత్వం ఇందులో ఎప్పటికప్పుడు కొత్త సేవలను పొందుపరుస్తూ అనేక మార్పులు చేస్తోంది. ఈ క్రమంలో వాట్సప్ గవర్నెన్స్‌లో ప్రభుత్వం మరో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇక నుంచి ప్రభుత్వ సేవలపై వాయిస్ మెస్సేజ్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించనుంది. ఈ మేరకు అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.
వాయిస్ మెస్సేజ్ ద్వారా ఫిర్యాదు..
ఇకపై ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వ ఆఫీసులు, అధికారుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. వాట్సప్ ద్వారా సులువుగా ఫిర్యాదు చేయవచ్చు. వాయిస్ మెస్సేజ్ రూపంలో వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించనున్నారు. త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సోమవారం ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు అన్ని జిల్లాల కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల్లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక నుంచి మీరు గ్రీవెన్స్ సెల్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. వాట్సప్ ద్వారా సులభంగా మీ సమస్యను వివరించవచ్చు. ఈ మేరకు కొత్త వ్యవస్థపై ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. వీలైనంత త్వరగా ఈ సదుపాయాన్ని అమల్లోకి తీసుకురావాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీని వల్ల ప్రజలు సమయం, డబ్బులు ఆదా కానున్నాయి.
చంద్రబాబు సమీక్ష
తాజాగా ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి ప్రభుత్వ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదు చేసే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు సులువుగా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. వాయిస్ మెస్సేజ్‌ల ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించాలని, వీటిన కూడా స్వీకరించి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఇక రాష్ట్రంలో మొబైల్ నెట్ వర్క్ కనెక్టివిటీ సమస్యలు రాకుండా చూడాలని, అన్ని ప్రాంతాల్లో మెరుగైన నెట్ వర్క్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య ఉందని, మూడు నెలల్లోగా ఆక్కడ పరిస్థితిని మెరుగుపర్చాలని చంద్రబాబు అన్నారు.