
కంటెంట్ ఉంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులనైన సృష్టించవచ్చు అని నిరూపించింది హాలీవుడ్ సైకలాజికల్, హారర్ థ్రిల్లర్ చిత్రం ‘అబ్సెషన్’ (Obsession). కేవలం రూ 7 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.17 వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఎవరూ ఊహించని స్థాయిలో హాలీవుడ్ లోనే కాదు.. విడుదలైన ప్రతి చోటా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. హారర్ హిస్టరీలోనే సరికొత్త రికార్డులను తిరగరాస్తూ, ఆల్-టైమ్ క్లాసిక్స్ అయిన ‘ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్’, జోర్డాన్ పీలే ‘గెట్ అవుట్’ చిత్రాల లైఫ్ టైమ్ కలెక్షన్లను సైతం దాటేసి ట్రెండింగ్‌లో నిలిచింది.
ఓటీటీలోకి రెడీ..
థియేటర్లలో రికార్డు స్థాయి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ క్రేజీ మూవీ.. ఇప్పుడు డిజిటల్ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. అభిమానుల ఉత్కంఠకు తెరదించుతూ.. జూన్ 30, 2026 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ , ఫాండంగో ఎట్ హోమ్ వంటి ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్ ఫ్లాట్ ఫామ్ లలో అద్దె విధానంలో అందుబాటులోకి రానుంది.
ఇంతకీ ఏంటి ఆ క్రేజీ కథ?
మ్యూజిక్ స్టోర్‌లో పనిచేసే బారోన్ అలియాస్ బేర్ (మైఖేల్ జాన్‌స్టన్), తన చిన్ననాటి స్నేహితురాలు నిక్కీ (ఇండీ నవరెట్టే)ని ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ, ఆ విషయం చెప్పడానికి భయపడతాడు. ఈ క్రమంలోనే కోరికలను నెరవేర్చే ‘వన్ విష్ విల్లో’ (One Wish Willow) అనే ఒక రహస్య మాయా స్టిక్ అతనికి దొరుకుతుంది. ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా నిక్కీ నన్నే ప్రేమించాలి అని బేర్ కోరుకుంటాడు. ఆ విష్ ఫలించి నిక్కీ అతనికి పడిపోతుంది. మొదట్లో అంతా రొమాంటిక్‌గా అనిపించినా, రోజులు గడిచేకొద్దీ నిక్కీ ప్రేమ హద్దులు దాటి సైకోలా మారిపోతుంది. ఆ ‘అబ్సెషన్’ ఎంత భీభత్సం సృష్టించింది? ఆ ప్రేమ కాస్తా ఒకరి ప్రాణాల మీదకు ఎలా వచ్చింది? అనేదే వెన్నులో వణుకు పుట్టించే అసలు కథ! కూపర్ టామ్లిన్సన్, ఆండీ రిక్టర్ కీలక పాత్రల్లో నటించారు.
►ALSO READ | Awarapan 2 Teaser: 19 ఏళ్ల తర్వాత వస్తున్న కల్ట్ క్లాసిక్ సీక్వెల్.. ట్రెండింగ్లో ‘అవరాపన్ 2’ టీజర్
ఇండియాలో వసూళ్లు..
హాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనూ ఈ చిత్రానికి లభించిన రెస్పాన్స్ చూసి దర్శకుడు కర్రీ బార్కర్ సైతం నోరెళ్లబెట్టారు. మేం ఈ సినిమాను దాదాపు శూన్య బడ్జెట్‌తో తీశాం. ఇండియాలో ఇంత పెద్ద హిట్ అవుతుందని అస్సలు ఊహించలేదు అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇండియాలో ఈ మూవీ 90 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ట్రేడ్ వర్గాలను సహింతం షాక్ కు గురిచేసింది. అత్యథిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
మే 15న రిలీజ్ అయిన ఈ సినిమాను తొలుత ఫోకస్ ఫీచర్స్ జూన్ 2నే డిజిటల్‌గా రిలీజ్ చేయాలనుకుంది. కానీ జూన్ 2 ఒక్కరోజే థియేటర్లలో ఏకంగా 5.7 మిలియన్ల డాలర్లు రావడంతో, థియేట్రికల్ రన్‌ను పొడిగించారు. థియేటర్లలో భయపెట్టిన ఈ సైకో-థ్రిల్లర్, ఇప్పుడు మీ హోమ్ స్క్రీన్స్‌పై ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి మరి.