
మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. బండాలోని ఒక సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 19 నెలల పసికందు, వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా శాశ్వతంగా కంటిచూపు కోల్పోయాడు. జలుబు చికిత్స కోసం వచ్చిన బాలుడి కళ్లలో డాక్టర్ సెలైన్ నాసికా చుక్కలను వేశాడని బాధితుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
మే 29వ తేదీన, ఇంద్రజ్ విశ్వకర్మ తన 19 నెలల కుమారుడు వినయ్ విశ్వకర్మకు జలుబు లక్షణాలతో పాటు కళ్లు ఎర్రబడటంతో బండాలోని సివిల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. తండ్రి ఫిర్యాదు ప్రకారం, విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ వైద్యుడు బాలుడిని పరీక్షించి, చికిత్సలో భాగంగా అతని కళ్లలో సెలైన్ నాసికా చుక్కలను వేశారు. దానితో పాటు పారాసెటమాల్ సిరప్, ఒక ఇంజెక్షన్, మరికొన్ని మందులను సూచించారు.
అయితే, మందులు వేసిన కొన్ని గంటల్లోనే చిన్నారి పరిస్థితి విషమించింది. కొన్ని గంటలపాటు ఆసుపత్రిలోనే వేచి ఉన్నా బాలుడిలో ఎలాంటి మెరుగుదల కనిపించకపోవడంతో, అక్కడి వైద్యులు వారిని సాగర్‌లోని జిల్లా ఆసుపత్రికి పంపించారు. ఆ తర్వాత పరిస్థితి తీవ్రతను గమనించి ఉన్నత వైద్య సదుపాయం కోసం భోపాల్ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ఎయిమ్స్ వైద్యుల షాకింగ్ నిజం..!
ఎయిమ్స్‌లో బాలుడిని పరీక్షించిన వైద్యులు ఆ కుటుంబానికి కోలుకోలేని షాక్ ఇచ్చారు. పసికందు శాశ్వతంగా కంటిచూపు కోల్పోయాడని వారు ధృవీకరించారు. తప్పుడు చికిత్స, వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని వైద్యులు సూచించినట్లు బాలుడి తండ్రి ఆరోపించారు. ఈ దారుణ ఘటనపై బాధ్యుడైన డాక్టర్, ఇతర ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇంద్రజ్ విశ్వకర్మ బండా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు ఆ డాక్టర్ పేరు తెలియకపోయినా, చూస్తే గుర్తించగలనని ఆయన పోలీసులకు తెలిపారు.
ఈ ఘటనపై విచారణకు చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారని బ్లాక్ మెడికల్ ఆఫీసర్ యోగేంద్ర ఖటిక్ వెల్లడించారు. విచారణలో తేలిన అంశాల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. తమ బిడ్డ జీవితాన్ని అంధకారం చేసిన బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా డిమాండ్ చేస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..