Reading Time: 2 minutes
Ketan Agarwal Murder Case Siya Goyal Failed Class 12 Home Baking Business Mother Revelation

పూణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో అరెస్టైన సియా గోయల్ గురించి ఆమె తల్లి పూజా గోయల్ పలు సంచలన విషయాలు వెల్లడించారు. తమ కుమార్తెకు చదువుపై అంతగా ఆసక్తి లేదని.. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిందని చెప్పారు. 12వ తరగతిలో తమ కుమార్తె ఉత్తీర్ణత సాధించలేదని.. ఈ విషయాన్ని నిశ్చితార్థానికి ముందే కేతన్ అగర్వాల్ కుటుంబ సభ్యులకు చెప్పినట్లుగా తెలిపారు.

సియాకు చదువు అబ్బకపోవడంతో ఇంటి నుంచి హోమ్ బేకింగ్ వ్యాపారం మొదలు పెట్టిందని.. కేకులు, బేకరీ వ్యాపారాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఇదే విషయాన్ని కేతన్ తల్లి సహా వారి కుటుంబ సభ్యులకు ముందే తెలియజేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం సియా పూణెలోని ఓ కళాశాలలో కామర్స్ విద్యార్థిగా జాయిన్ అయినా కూడా ఇప్పటి వరకు కాలేజీకి వెళ్లలేదని పేర్కొన్నారు. సియా-చేతన్ చౌదరి మధ్య ఉన్న సంబంధంపై కూడా స్పందించారు. పూణెలోని మార్కెట్ యార్డ్ ప్రాంతంలో జరిగిన ఓ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా ఇద్దరికీ పరిచయం ఏర్పడిందని తెలిపారు. అయితే కేతన్‌తో నిశ్చితార్థం జరిగే సమయానికి వారిద్దరి మధ్య ప్రేమ సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సియా.. కేతన్‌ను దూరం పెట్టేదన్న ఆరోపణలను ఖండించారు. కేతన్ ఫోన్ చేసిన ప్రతిసారి సియా స్పందించేదని చెప్పారు.

చేతన్ గురించి పొరుగువారు

ఇదిలా ఉంటే.. చేతన్ చౌదరి నివసిస్తున్న శ్రీ పార్శ్వనగర్ సొసైటీకి చెందిన స్థానికులు అతడు క్రీడలను ఎంతో ఇష్టపడే వ్యక్తి అని చెప్పారు. అతని దగ్గర 150కు పైగా క్రికెట్ ట్రోఫీలు ఉన్నాయని, ఎప్పుడూ హింసాత్మక స్వభావాన్ని ప్రదర్శించలేదని పేర్కొన్నారు. చేతన్ బాబాయి ఉదయ్‌రామ్ కూడా తమ కుటుంబం ఈ ఆరోపణలను ఇప్పటికీ నమ్మలేకపోతోందని తెలిపారు. ఇక చేతన్ తరఫు న్యాయవాది రామ్ షహానే మాట్లాడుతూ.. తన క్లయింట్ ఈ కేసులో రెండో నిందితుడేనని పేర్కొన్నారు. సియా-చేతన్ మధ్య జరిగిన వేలాది ఫోన్ కాల్స్ పూర్తిగా స్నేహం, వ్యాపార సంబంధిత చర్చలేనని వాదించారు.

కేతన్ తల్లి ఏమన్నారు?

మరోవైపు కేతన్ అగర్వాల్ తల్లి రాఖీ అగర్వాల్.. సియాను సాధారణ, మర్యాదపూర్వక యువతిగానే తాము భావించామని చెప్పారు. కుటుంబ వేడుకలు, పూజలు, పుట్టినరోజు వేడుకలు, విందులకు సియా ఎన్నోసార్లు హాజరైందని గుర్తు చేసుకున్నారు. మామూలు అమ్మాయిలాగే కనిపించేదని.. ఇలా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదని రాఖీ అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు.