
హైదరాబాద్ సిటీలో భారీ నకిలీ ముఠా పట్టుబడింది. నిన్నా మొన్నటి వరకు కల్తీలతో జనం ఆరోగ్యాన్ని పాడుతున్న కేటుగాళ్లు.. ఇప్పుడు నకిలీ సిగరెట్లతో ధూమపాన ప్రియుల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారు. సిగరెట్లలోనే టాప్ బ్రాండ్ అయిన గోల్డ్ ఫ్లాక్ పేరుతో నకిలీ సిగరెట్లను గోషామహల్ పోలీసులు పట్టుకోవటానికి.. ఈ ముఠా బండారం బయటపడింది. మూడు లక్షల రూపాయల విలువైన నకిలీ గోల్డ్ ఫ్లాక్ సిగరెట్లు పట్టుబడటం కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ సిటీలోని బేగంబజార్ లో మంగళం ట్రేడర్స్ పేరుతో హోల్ సేల్ దుకాణం నడుపుతున్నాడు మనీష్ కుమార్. ఇతను సిటీలోని చాలా పాన్ షాపులకు హోల్ సేల్ గా సిగరెట్లు విక్రయిస్తూ ఉన్నాడు. కొంత కాలంగా గోల్డ్ ఫ్లాక్ పేరుతోనే.. నకిలీ గోల్డ్ ఫ్లాక్ బ్రాండ్ ఉన్న సిగరెట్లను పాన్ షాపులకు అమ్ముతున్నాడు. మార్కెట్ ధర కంటే తక్కువకే వీటిని పాన్ షాపులకు అమ్ముతున్నాడు. తక్కువ ధరకు వస్తున్నాయని.. ఎక్కువ లాభం వస్తుందనే ఉద్దేశంతో పాన్ షాపులు కూడా ఇతని దగ్గర సిగరెట్లు కొనుగోలు చేస్తున్నాయి.
మార్కెట్ లో గోల్డ్ ఫ్లాక్ నకిలీ సిగరెట్ల అమ్మకాలపై అనుమానం రావటంతో.. ఇంటలెక్చల్ ప్రాపర్టీ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు గోల్డ్ ఫ్లాక్ కంపెనీ ప్రతినిధులు సమాచారం ఇచ్చారు. ఈ కంప్లయింట్ ఆధారంగా ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఇంటలెక్చల్ ప్రాపర్టీ ఇన్విస్టిగేషన్ బ్యూరో సభ్యులు సంయుక్తంగా బేగంబజార్ లోని హోల్ సేల్ షాపులపై రైడ్ చేశారు. అక్కడి సిగరెట్లను తనిఖీ చేశారు.
►ALSO READ | కెరీర్ సెట్ చేసుకోమని లవర్ చేతికి కోటి.. పెళ్లి షాపింగ్ పేరుతో కేతన్ నుంచి డబ్బు తీసుకున్న సియా !
ఈ దాడుల్లో మనీష్ కుమార్ నిర్వహిస్తున్న మంగళం ట్రేడర్స్ హోల్ సేల్ షాపులో పెద్ద ఎత్తున గోల్డ్ ఫ్లాక్ నకిలీ సిగరెట్లు పట్టుబడ్డాయి. వీటి విలువ 3 లక్షల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు అధికారులు. సీజ్ చేసిన నకిలీ సిగరెట్లతోపాటు మనీష్ కుమార్ ను గోషామహల్ పోలీసులకు అప్పగించారు. ఇతనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని వెల్లడించారు. నకిలీ సిగరెట్లతో ధూమపాన ప్రియుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని.. ఇలాంటి నకిలీలు కల్తీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు.