Reading Time: < 1 minute
Hydra Saves Rs 750 Crore Government Land In Hasmathpet

హస్మత్‌పేటలో హైడ్రా చేపట్టిన చర్యపై నిరుపేదల ఇళ్లను కూల్చివేశారంటూ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని అధికారులు పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతోనే కొందరు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. విమర్శలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. హస్మత్‌పేట సర్వే నంబర్-1లో మొత్తం 108 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. దశాబ్దాలుగా జరిగిన అక్రమ ఆక్రమణల కారణంగా ఇప్పటికే 98 ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వానికి కేవలం 10 ఎకరాల భూమి మాత్రమే మిగిలి ఉంది. ఈ చివరి భూమిని కూడా ఆక్రమణదారుల నుంచి కాపాడి భవిష్యత్ ప్రజా అవసరాల కోసం భద్రపరచాలనే ఉద్దేశంతోనే హైడ్రా చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు.

హైడ్రా ఇప్పటికే ప్రజలు నివసిస్తున్న శాశ్వత ఇళ్లను ఎక్కడా కూల్చలేదని అధికారులు స్పష్టం చేశారు. జీవో నెం.58, 59 కింద క్రమబద్ధీకరించిన ఇళ్లను తొలగించారనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. రెవెన్యూ శాఖ అధికారుల అధికారిక లేఖ ఆధారంగా.. వారి సమక్షంలో భారీ పోలీసు బందోబస్తుతో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో కేవలం ప్రభుత్వ భూమిపై కొత్తగా నిర్మించిన ప్రీకాస్ట్ గోడలు, తాత్కాలిక షెడ్లు, అక్రమ కంచెలు, ప్లాట్లుగా విభజించేందుకు చేసిన ఏర్పాట్లను మాత్రమే తొలగించినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ హైడ్రా స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయం కాదని, రెవెన్యూ శాఖ అధికారుల లిఖితపూర్వక విజ్ఞప్తి మేరకే ప్రభుత్వ భూమిని రక్షించేందుకు చేపట్టిన చట్టబద్ధమైన పరిపాలనా చర్య అని అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం హైడ్రా రక్షించిన 10 ఎకరాల ప్రభుత్వ భూమి మార్కెట్ విలువ సుమారు రూ.750 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ భూమి కూడా కబ్జాకు గురైతే భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, పార్కులు, రహదారులు వంటి ప్రజా అవసరాల కోసం భూమి అందుబాటులో ఉండదని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తి కాబట్టి.. వాటిని రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. హస్మత్‌పేటలో జరిగింది పేదల ఇళ్ల కూల్చివేత కాదని.. దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ ఆక్రమణలను అడ్డుకుంటూ ప్రజా ఆస్తిని కాపాడిన చర్య మాత్రమేనని స్పష్టం చేశారు.