Reading Time: < 1 minute
లేరా.. సుశీల్.. తల్లి ‌కళ్లెదుటే విగతజీవిగా కొడుకు.. అతివేగం.. రెప్పపాటులో ఊహించని ప్రమాదం..

శుభకార్యానికి వెళ్లిన ఆ కుటుంబం అప్పటిదాకా ఆనందంగా గడిపింది. కొద్ది క్షణాల్లో గమ్య స్థానం చేరుకునే సమయంలో ఆగి ఉన్న లారీ వారి ఒక్కగానొక్క కుమారుడి పాలిట మృత్యుపాశం అవుతుందని తల్లిదండ్రులు ఊహించలేదు.. ఘోర ప్రమాదంలో కొడుకు ప్రాణాలు కోల్పోయాడు.. దీంతో ‘లేరా సుశీల్’ అంటూ తల చిద్రమై విగతజీవిగా పడి ఉన్న కుమారుడిని పట్టుకొని తల్లి రోదించిన తీరు చూపరులకు కన్నీరు తెప్పించింది. ఈ విషాదఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం ఎక్స్ రోడ్డు- శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి.

ఎస్సై భూమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రం లోని శ్రీనివాస గార్డెన్స్ సమీపంలో నివాసం ఉంటున్న నరెందుల కృష్ణమోహన్-పద్మ భార్యాభర్తలు. భార్యభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు వెంకటసాయి సుశీల్(18) ఇటీవలే ఇంటర్ పూర్తి చేశాడు. పెద్దపల్లి జిల్లాలో ఓ శుభకార్యం కోసం పద్మ అత్త ఉదయలక్ష్మితో కలిసి వారి సొంత కారులో ఉదయం బయలుదేరారు. సాయంత్రం మంచిర్యాలలోని ఇంటికి బయలుదేరారు. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాం అనే సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారు నడుపుతున్న కృష్ణమోహన్ వేగంగా వెళ్లి శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీకొట్టాడు.

కారు వేగం ఎక్కువగా ఉండడంతో ప్రమాదం ధాటికి కారులో ఎడమవైపు కూర్చున్న వెంకటసాయి సుశీల్ తల – మొండెం వేరయ్యాయి. వెనుక సీటులో ఎడ మవైపు కూర్చున్న ఉదయలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణమోహన్, పద్మ స్వల్పంగా గాయపడ్డారు. అప్పటి వరకు తల్లిదండ్రులతో సరదాగా కబుర్లు చెబుతూ వచ్చిన ఒక్కగానొక్క కొడుకు సుశీల్ రెప్పపాటులో విగతజీవిగా మారడంతో తల్లి పద్మ గుండెలు పగిలేలా రోదించింది.

కారులో వెంకటసాయి సుశీల్ మృతదేహం ఇరుక్కుపోవడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని అతి కష్టం మీద మృతదేహాన్ని బయటకు తీశారు. ప్రమాదంలో గాయపడిన ఉదయలక్ష్మి, పద్మ, కృష్ణమోహన్ ను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. మృతుడు తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..