బరువు తగ్గడానికి బెస్ట్ ఛాయిస్: గుడ్లు ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక గొప్ప సహజ వనరు. ఒక పూర్తి గుడ్డులో సుమారు 6 గ్రాముల అత్యంత నాణ్యమైన ప్రోటీన్ ఉంటుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు అస్సలు ఉండవు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. ఇది కాకుండా గుడ్డు సొనలో మెదడు అభివృద్ధికి, కండరాల పనితీరుకు అవసరమైన కోలిన్, నాడీ వ్యవస్థను రక్షించే విటమిన్ బి12, కంటిచూపును మెరుగుపరిచే ల్యూటిన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
రోజుకు ఎన్ని గుడ్లు తినవచ్చు?: సమతుల్య ఆహారంలో భాగంగా ఆరోగ్యంగా ఉన్న ఏ వ్యక్తి అయినా సరే రోజుకు ఒకటి నుండి రెండు గుడ్లు ధైర్యంగా తినవచ్చని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. గుండె ఆరోగ్యం కోసం ప్రతిరోజూ ఒక పూర్తి గుడ్డు లేదా రెండు గుడ్డు తెల్లసొనలను తినాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా సూచిస్తోంది. గుడ్లు తిన్న తర్వాత ఎక్కువ సేపు ఆకలి వేయదు, దీనివల్ల అతిగా తినడాన్ని నివారించి, బరువును ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు.
కొలెస్ట్రాల్: గతంలో గుడ్డు సొనలోని కొలెస్ట్రాల్ రక్తంలో కలిసి గుండె జబ్బులకు కారణమవుతుందని హెచ్చరించేవారు. కానీ ఆహారం ద్వారా మనం తీసుకునే కొలెస్ట్రాల్.. మన రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలపై నేరుగా పెద్దగా ప్రభావం చూపదని ఇటీవలి పరిశోధనలు నిరూపించాయి. మన శరీరానికి అవసరమైన కొలెస్ట్రాల్‌ను మన కాలేయమే స్వయంగా ఉత్పత్తి చేసుకుంటుంది. అందువల్ల గుడ్లలోని కొలెస్ట్రాల్ గురించి భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ, అమెరికన్ పోషకాహార మార్గదర్శకాలు కూడా తమ పాత హెచ్చరిక నిబంధనలను తొలగించాయి.
ఎవరు జాగ్రత్తగా ఉండాలి?: గుడ్లు శరీరానికి ఎంతో మేలు చేసినప్పటికీ.. ఇప్పటికే తీవ్రమైన గుండె జబ్బులు, టైప్ 2 మధుమేహం లేదా అధిక రక్త కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరు వారానికి 3 నుండి 4 గుడ్లను మాత్రమే పచ్చసొనతో తినాలి. లేదా డాక్టర్ల సలహా మేరకు పచ్చసొనను పక్కన పెట్టి, కేవలం ప్రోటీన్ మాత్రమే ఉండే తెల్లసొనను హ్యాపీగా తినవచ్చు.
వండేటప్పుడు ఈ చిన్న మార్పు చేసుకోండి: గుడ్డు ఇచ్చే ఆరోగ్యం మనం దాన్ని వండే విధానంపై కూడా ఆధారపడి ఉంటుంది. గుడ్లు ఫ్రై లేదా ఆమ్లెట్ వేసేటప్పుడు వెన్న లేదా జంతు సంబంధిత కొవ్వులను ఉపయోగించడానికి బదులుగా.. వెజిటబుల్ ఆయిల్ లేదా ఆలివ్ నూనెను ఉపయోగించడం వల్ల గుండె ఆరోగ్యం మరింత మెరుగవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.




