Reading Time: 2 minutes

ఎప్పుడైనా స్నేహితులతోనో కుటుంబంతోనో ట్రిప్స్ కి వెళ్లడం ఎవరికైనా ఎంతో సరదాగా ఉంటుంది. అయితే ప్రయాణాల్లో చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే.. దొరికిన జంక్ ఫుడ్ అంతా తినేయడం. ముఖ్యంగా రూమ్‌లలో మ్యాగీ, నూడుల్స్ లాంటి ఇన్‌స్టెంట్ ఫుడ్స్ వండుకుని తింటుంటారు. ఇవి టేస్టీగా ఉన్నా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. జర్నీలో కడుపు ఖరాబైతే ట్రిప్ అంతా పాడైపోతుంది. అందుకే ప్రయాణాల్లో కూడా హెల్తీగా ఉంటూ ఎలాంటి ఆహారం తీసుకోవాలో కొన్ని సింపుల్ టిప్స్ ఇప్పుడు చూద్దాం.

ఇన్‌స్టెంట్ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి: ట్రిప్‌కి వెళ్లినప్పుడు సులభంగా అయిపోతుందని చాలామంది మ్యాగీలు, ప్యాకెట్ నూడుల్స్, చిప్స్ లాంటివి ఎక్కువగా తింటారు. వీటిలో మైదా ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఇక ప్రయాణంలో ఉన్నప్పుడు మన శారీరక శ్రమ వేరేలా ఉంటుంది కాబట్టి, ఇలాంటి ఫుడ్స్ వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ మరియు మోషన్స్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

Travel Smart: Healthy Eating Tips for Every Trip
Travel Smart: Healthy Eating Tips for Every Trip

వెంట తీసుకెళ్లాల్సిన హెల్తీ స్నాక్స్: జర్నీలో ఆకలి వేసినప్పుడు బయట జంక్ ఫుడ్ కొనకుండా మనమే కొన్ని హెల్తీ స్నాక్స్ వెంట పట్టుకెళ్లడం మంచిది. బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ మరియు ఖర్జూరాలు జేబులో ఉంచుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే వేయించిన శనగలు,పేలాలు ఇంట్లో చేసిన మురుకులు వంటివి ఆకలిని తీర్చడమే కాకుండా పొట్టకు కూడా చాలా లైట్‌గా ఉంటాయి.

పండ్లు మరియు తాజా ఆహారానికే ప్రాధాన్యత: ట్రిప్స్ లో ఉన్నప్పుడు స్థానికంగా దొరికే అరటిపండ్లు, ఆపిల్స్, నారింజ వంటి పండ్లను తినడానికి ప్రయత్నించండి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి జర్నీ అలసటను తగ్గిస్తాయి. అలాగే హోటళ్లలో తినాల్సి వచ్చినప్పుడు మసాలాలు, ఆయిల్ ఎక్కువగా ఉండే బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్స్ జోలికి వెళ్లకుండా.. వేడివేడిగా ఉండే ఇడ్లీ, దోశ లేదా నార్మల్ రైస్, పప్పు లాంటి సాత్విక ఆహారాన్ని ఎంచుకోండి.

బాడీని డీహైడ్రేట్ అవ్వనివ్వకండి: ప్రయాణాల్లో తిండి కంటే కూడా నీళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. చాలామంది యూరిన్ వస్తుందని భయపడి జర్నీలో నీళ్లు సరిగ్గా తాగరు. దీనివల్ల బాడీ డీహైడ్రేట్ అయి తలనొప్పి, నీరసం వస్తాయి. అందుకే ఎక్కడికి వెళ్లినా మంచి నీళ్ల బాటిల్ వెంట ఉంచుకోండి. ఇక బయట దొరికే కూల్ డ్రింక్స్, ప్యాకెట్ జ్యూస్‌ల కంటే కూడా కొబ్బరిబొండాలు, మజ్జిగ లేదా నిమ్మరసం తాగడం ఎంతో ఉత్తమం.

ఇక ట్రిప్ అనేది మనం మైండ్ రిలాక్స్ చేసుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి వెళ్తాం. ఆ సమయంలో అనారోగ్యం బారిన పడితే టూర్ మొత్తం చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అందుకే ఇన్‌స్టెంట్ ఫుడ్స్‌ను పక్కన పెట్టి, ప్రయాణాల్లోనూ కాస్త చూసి హెల్తీగా తింటే ఎనర్జిటిక్‌గా తిరగొచ్చు.

గమనిక: జర్నీ చేసేటప్పుడు బయట రోడ్డు పక్కన కట్ చేసి తెరిచి ఉంచిన పండ్ల ముక్కలను తినకండి. వాటిపై ఈగలు వాలడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఎప్పుడైనా సరే తాజా పండ్లను మీ ముందే కట్ చేయించుకుని లేదా మీరే వలుచుకుని తినడం సురక్షితం.

The post ట్రిప్‌లోనూ హెల్తీగా తినండి… ఈ టిప్స్ ఫాలో అవ్వండి appeared first on Manalokam – Latest Telugu News & Updates.