
అయోధ్య రామ మందిరంలో దొంగతనం, విరాళాల దోపిడీ కేసులో అరెస్ట్ అయిన 8 మంది నిందితుల తరపున ఏ లాయర్ వాదించకూడదని.. ఈ కేసును ఏ లాయర్ తీసుకోకూడదని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. ఏ లాయర్ అయినా ఈ కేసును తీసుకుని.. రామ మందిరం దొంగల తరపున వాదిస్తే.. ఆ లాయర్ కు 5 లక్షల రూపాయల జరిమానా విధించటం జరుగుతుందని బార్ అసోసియేషన్ తీర్మానం చేయటం సంచలనంగా మారింది.
అయోధ్య రామ మందిరంలో 200 కోట్ల రూపాయల వరకు నగదు, బంగారం, వెండి, వజ్రాలు వంటి విలువైన వస్తువులు మాయం అయ్యాయని.. రాముడి పేరుతో రామాలయం పేరుతో దొంగతనం చేశారంటూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే విచారణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. విచారణ చేసిన సిట్.. అయోధ్య రామ మందిరంలో నిధులు దుర్వియోగం అని చెబుతూ.. ఎనిమిది మందిని అరెస్ట్ చేసింది.
ఈ అరెస్టుల తర్వాత ట్రస్ట్ కీలక సభ్యుడు చంపత్ రాయ్ రాజీనామా చేశారు. రామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శగా ఉన్న చంపత్ రాయ్ ఆధ్వర్యంలోనే నిధులు స్వాహా జరిగినట్లు ప్రాథమికంగా నిర్థారించారు సిట్ అధికారులు. ఈ క్రమంలోనే ఫైజాబాద్ బార్ అసోసియేషన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది.
రామ జన్మభూమి ట్రస్ట్ కు రాజీనామా చేసిన ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తోపాటు ఈ కుంభకోణంలో సంబంధం ఉన్న అనిల్ మిశ్రా, గోపాల్ రావు ముగ్గురు వెంటనే అయోధ్యను వీడి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీ చేసింది బార్ అసోసియేషన్. మా తీర్మానాన్ని పట్టించుకోకుండా అయోధ్యలోనే ఉంటే.. అయోధ్య సిటీనే ముట్టడిస్తామని హెచ్చరించింది బార్ అసోసియేషన్.
రామ జన్మభూమి ట్రస్ట్ నిర్వాకం వల్ల.. అయోధ్య రామాలయంలో నిధుల దుర్వినియోగం వల్ల కోట్ల మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని.. దశాబ్దాల పోరాటం తర్వాత కార్యరూపం దాల్చిన రామాలయం నిర్మాణం ప్రతిష్ఠకే భంగం కలిగించే విధంగా నిందితుల వ్యవహారం ఉందని ఆవేదన వ్యక్తం చేసింది ఫైజాబాద్ బార్ అసోసియేషన్.
అయోధ్య రామాలయంలో నిధుల దొంగతనం, దోపిడీకి సంబంధించిన కేసులో ఉన్న నిందితుల తరపున ఫైజాబాద్ బార్ అసోసియేషన్ నుంచి ఏ ఒక్క లాయర్ వాదించకూడదని నిర్ణయించటంతోపాటు.. ఎవరైనా లాయర్ ముందుకొస్తే 5 లక్షల రూపాయల ఫైన్ విధించే విషయంగా కఠినంగా ఉంటామని స్పష్టం చేసింది బార్ అసోసియేషన్. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని.. అయోధ్య ప్రతిష్ఠను దెబ్బతీసే వ్యక్తులు ఎవరైనా సహించేది లేదని హెచ్చరించారు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కలికా ప్రసాద్ మిశ్రా.