
రైలు ప్రయాణం చేసే వాళ్లు.. ముఖ్యంగా ఫ్యామిలీతో వెళ్తున్న సమయంలో కచ్చితంగా ఇంటి నుంచి ఆహారం తీసుకెళ్లటం కామన్. ఖర్చు తగ్గించుకోవడానికి.. లేదంటే బయటి ఫుడ్ క్వాలిటీపై నమ్మకం లేకపోవడం.. కారణమేదైనా గానీ జర్నీలో చపాతీ, పులిహోరా, ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్ ఐటమ్స్ తో పాటు లంచ్, డిన్నర్ కోసం వండుకుని తీసుకెళ్లడం పరిపాటి. అయితే ఇంటి ఫుడ్ తీసుకెళ్లిన వారికి రైల్వే శాఖ భారీ షాకిచ్చింది. ఒకే రోజులో దాదాపు 1450 కేసులు, సుమారు 3 లక్షల రూపాయల వరకు జరిమానా విధించి ప్రయాణికులకు పెద్ద ట్విస్టే ఇచ్చారు అధికారులు.
రైళ్లలో ఇంటి ఫుడ్ పై ఎలాంటి నిషేధం లేదు. నచ్చిన ఫుడ్ తీసుకెళ్లవచ్చు. మరి అలాంటప్పుడు ఫైన్ విధించడమేంటనే ప్రశ్న రావచ్చు. అక్కడే ఉంది అసలు ట్విస్టు. అదేంటో మీరే చదవండి.
రైళ్లను నీట్ గా హైజీనిక్ గా ఉంచేందుకు రైల్వే నడుం బిగించింది. ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకున్నా సరే కానీ.. రైలు భోగీలను అపరిశుభ్రం చేస్తే కఠిన చర్యలకు పూనుకుంది. అందులో భాగంగా ఒకేరోజు వివిధ ప్రాంతాలలో పెద్ద ఎత్తున రైడ్స్ నిర్వహించింది. ఈస్ట్ రైల్వే జోన్ పరిధిలోని వివిధ స్టేషన్లలో, రైళ్లలో రైడ్స్ నిర్వహించారు.
ఒక్క రోజులోనే 1,447 కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రైళ్లను అపరిశుభ్రానికి గురి చేస్తున్న వారి నుంచి 2 లక్షల 89 వేల 400 రూపాయల ఫైన్ వసూలు చేశారు. ప్రయాణికుల భద్రత, ప్రజా ఆస్తిని కాపాడే లక్ష్యం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
రైడ్స్ వివరాలు:
ఈస్ట్ రైల్వే జోన్ పరిధిలోని అన్ని డివిజన్లలో అధికారులు రైడ్స్ నిర్వహించారు. పరిశుభ్రతకు సంబంధించి నిబంధనలు పాటించని ప్రయాణికులను అధికారులు గుర్తించారు. బోగీలో సీట్ల కింద, డోర్ దగ్గర, బాత్ దగ్గర తిన్న ఆహార పదార్థాలను పడవేసినట్లు గుర్తించారు. ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ ప్లేట్లు, బాటిల్స్ ఎక్కువగా పడేసినట్లు నిర్ధారించారు.
►ALSO READ | కొండగట్టులో 42వ గిరి ప్రదక్షిణ.. వినూత్నంగా సీడ్ బాల్స్ విసిరిన భక్తులు
హౌరా డివిజన్ లో మొత్తం 457 మంది ప్రయాణికులపై కేసులు నమోదు చేశారు అధికారులు. వీరి నుంచి 91 వేల 400 రూపాయల జరిమానా వసూలు చేశారు. ఆ తర్వాత అసన్సోల్ డివిజన్ లో 217 మంది రైలు భోగీలను చెత్తతో నింపేసినట్లు తేల్చారు. వారి నుంచి 43 వేల 400 రూపాయల ఫైన్ వసూలు చేశారు. ఇక మాల్డా డివిజన్ లో 158 కేసులకు రూ.31 వేల 600 జరిమానా విధించారు.
ఈ తనిఖీల్లో అత్యధికంగా కేసులు నమోదైనది సీల్దా డివిజన్ లో అని అధికారులు తెలిపారు. ఒక్క రోజులోనే 615 మంది ప్రయాణికులపై లక్షా 23 వేల జరిమానా వసులు చేశారు. ఇది ఆరంభం మాత్రమేనని.. భవిష్యత్తులో ఇలాంటి రైడ్స్ జరుగుతుంటాయని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి రైళ్లలను కంపు లేపే వారిపై కఠిన చర్యలు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు.