Reading Time: < 1 minute

తెలంగాణ, ఏపీలో ఎక్కడైనా ఒక్క ఓటు మాత్రమే ఉండాలి : ఈసీకి కవిత కంప్లయింట్

Caption of Image.

SIR.. సర్.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో జరుగుతున్న ఓటర్ల ప్రక్రియపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత సంచలన డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా సర్ నిర్వహిస్తున్న క్రమంలో.. రాష్ట్రాల మధ్య డేటాను కూడా పరిశీలించాలని ఎన్నికల సంఘానికి డిమాండ్ చేశారామె. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న ఓటర్లలో లక్షల మందికి ఆంధ్రాలోనూ ఓటు ఉందని.. ఏపీ, తెలంగాణలో ఎక్కడైనా ఒక ఓటు మాత్రమే ఉండాలా చూడాలని.. ఇంటర్ స్టేట్ డూప్లికేట్ ఓట్లను తొలగించాలని ఎన్నికల సంఘానికి డిమాండ్ చేశారు కవిత.

మీడియాతో మాట్లాడిన కవిత.. దేశంలో ఇప్పటివరకు 8 సార్లు SIR జరిగిందన్నారు.  సర్ ప్రక్రియ జరుగుతున్నందున రాష్ట్రాల మధ్య ఓటర్ల డాటాను క్షుణ్ణంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న ఓటర్లకు ఆంధ్రాలో కూడా ఓట్లు ఉన్నాయని.. దేశంలో ఎక్కడైనా ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. ఇంటర్ స్టేట్ డూప్లికేట్ ఓట్లను వెంటనే తొలగించాలని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నట్లు వెల్లడించారు.

బోధన్ నియోజకవర్గంలో కేవలం ఏడాది కాలంలోనే ఏకంగా 7 వేల ఓట్లను డిలీట్ చేశారు.. దీనికి ఎన్నికల సంఘం ఏం సమాధానం చెప్తుంది? సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌కు రెండు చోట్ల ఉన్న ఓటును తొలగించడానికి అధికారులకు 7 సంవత్సరాల సమయం పట్టింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో మాత్రం కేవలం 800 ఓట్లు మాత్రమే తొలగించారు. మేము స్వయంగా కొడంగల్‌లో వెరిఫై చేస్తే అక్కడ 33 వేల డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు తేలింది.మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి 32 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారని.. అయితే కొడంగల్‌లో ఉన్న ఈ 33 వేల డూప్లికేట్ ఓట్లతోనే ఆయన గెలిచారనే అనుమానం తమకు ఉందని కవిత ఆరోపించారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి కేవలం నోట్ల బదిలీ మాత్రమే కాదు..ఓట్ల బదిలీ కూడా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని దీనిపై ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి సమాధానం చెప్పాలని  కవిత డిమాండ్ చేశారు. 

©️ VIL Media Pvt Ltd.