
జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రంలో 42వ గిరి ప్రదక్షిణ మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శ్రీ సురేష్ ఆత్మరామ్ మహారాజ్ పిలుపు మేరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వేలాది మంది భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ చేస్తూనే, పర్యావరణ పరిరక్షణకు భక్తులు సరికొత్త బాటలు వేశారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన తరుణంలో… కొండగట్టు పరిసర ప్రాంతాలను పచ్చదనంతో నింపేందుకు ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది సంఖ్యలో సీడ్ బాల్స్ (విత్తన బంతులను) కొండ పరిసర ప్రాంతాల్లోకి విసిరారు. అంజన్న ఆశీస్సులతో పాటు ప్రకృతి మాతను రక్షించుకోవాలనే సంకల్పంతో భక్తులు చేసిన ఈ వినూత్న ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది. పచ్చని చెట్లతో కొండగట్టు మరింత శోభాయమానంగా మారాలని భక్తులు ఆకాంక్షించారు.