Reading Time: 2 minutes

వరంగల్ హైవేపై రాత్రుల్లో ఫ్యామిలీతో వెళ్తున్నారా.. ? ఘట్ కేసర్లో పోకిరీలు ఏం చేశారో చూడండి

Caption of Image.

నిత్యం రద్దీగా ఉండే వరంగల్ హైవేపై పోకిరీలు హల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘట్‌ కేసర్‌లో పోకిరీలు కారును వెంబడించి భయాందోళనలకు గురిచేశారు. కారును సైడ్ నుంచి తన్నటం, చేతితో కొట్టడం.. ఆగరా అరేయ్.. దమ్ముంటే ఆపు.. అంటూ పిచ్చి పట్టినట్లుగా అరవటంతో హైవేపై ఒక ఛేజింగ్ సీన్ జరిగినట్లు తయారైంది పరిస్థితి. జూన్ 21న రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన సిటీ జనాలను భయాందోళనకు గురిచేస్తోంది.

వివరాల్లోకి వెళ్తే..   హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్తున్న ఓ కారును కొంతమంది యువకులు బైక్‌లపై వెంబడించారు. కారును ఓవర్ టేక్ చేసి ముందుకు వెళ్లి కారును ఆపమంటూ నానా రభస చేశారు. దీంతో కారులో ఉన్న మహిళలు, చిన్నారులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి  బాధితురాలికి చెందిన బంధువు భార్గవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

కారులో మహిళలు, చిన్నారులు ఉన్నారని తెలిసి పోకిరీలు మరింత రెచ్చిపోయి భయపెట్టే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కారులోని డ్యాష్ క్యామ్‌లో రికార్డు అయ్యాయి.  బాధిత యువతి వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ALSO READ : సికింద్రాబాద్ లో ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్..

పోకిరీల వేధింపులతో కారులో ఉన్న చిన్నారులు భయపడి ఏడ్చినట్లు ఆమె తెలిపింది. కారును బాదటం, తన్నడంతో భారీ శబ్దానికి కారులో ఉన్న చిన్నారులు బిగ్గరగా ఏడుస్తుండటం వీడియోలో వినవచ్చు. ఈ ఘటనపై పోలీసులు స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవాలని భార్గవి డిమాండ్ చేసింది.

అయితే ఇప్పటివరకు ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనపై ఎవరూ ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.  సోషల్ మీడియాలో వచ్చిన వీడియోస్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

©️ VIL Media Pvt Ltd.