
డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ల జారీలో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని డెస్క్ జర్నలిస్టుల సంఘం(డీజేఎస్) డిమాండ్ చేసింది. 10–12 ఏండ్లకుపైగా సీనియారిటీ ఉన్న వారికి కూడా కార్డులు రావడం లేదని, అసంబద్ధమైన కారణాలను చూపుతూ అక్రెడిటేషన్లు నిరాకరరించడ సరికాదని విమర్శించింది. ఈ మేరకు డీజేఎస్ ఆధ్వర్యంలో డెస్క్ జర్నలిస్టులు సోమవారం (జూన్ 29) ఐ అండ్ పీఆర్ ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా డీజేఎస్ అధ్యక్షుడు బాదిని ఉపేందర్ మాట్లాడుతూ పాత కార్డులపై కొనసాగుతన్న బస్‌పాస్‌ల గడువు జూన్ 30తో ముగుస్తున్నందున.. తక్షణం కొత్త అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గత రెండు, మూడు దఫాలుగా అక్రెడిటేషన్లు పొందిన, పదేండ్లకుపైగా అనుభవం ఉన్న ప్రతి డెస్క్ జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డు రాకపోవడం బాధకరమని.. వారందరికి వెంటనే కార్డులు ఇవ్వాలని కోరారు.
అలాగే మహిళా జర్నలిస్టులు లేని చోట, ఆ కోటా కార్డులు అదే సంస్థలో పని చేస్తున్న అర్హులైన మిగతా జర్నలిస్టులకు ఇవ్వాలన్నారు. తెలంగాణలో దివ్యాంగులైన వర్కింగ్ జర్నలిస్టులు అతి తక్కువ సంఖ్యలో ఉన్నారని.. మేనేజ్మెంట్ల కోటాతో సంబంధం లేకుండా వారందరికి కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాల్లో అప్లికేషన్లను వెంటనే అప్రూవ్ చేసి తక్షణం కార్డులు అందజేయాలన్నారు.
►ALSO READ | తెలంగాణ పోలీసు శాఖలో ప్రమోషన్స్.. 36 మంది సీఐలకు డీఎస్పీలుగా పోస్టింగ్స్
మండల స్థాయి విలేకరులకు అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చే విషయంలో మండలంలోని సర్క్యులేషన్‌పై సీఏ సర్టిఫికెట్ కోరడం పూర్తిగా అసంబద్ధమన్నారు. పత్రికలు తమ మొత్తం సర్క్యులేషన్‌పై కేంద్ర ప్రభుత్వం గుర్తింపు కలిగిన ఏబీసీ, పీఆర్‌జీఐ సర్టిఫికెట్లు సమర్పించాయని.. అయినప్పటికీ మళ్లీ సీఏ సర్టిఫికెట్ అడగడం మండల విలేకరులకు అక్రెడిటేషన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడమేనన్నారు. ఐ అండ్ పీఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో హామీ ఇచ్చినట్టుగా ఎక్కువ జనాభా కలిగిన మండలాల్లో మండల స్థాయి విలేకరులకు ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఇవ్వాలన్నారు.
అనంతరం ఐ అండ్ పీఆర్ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో.. డిమాండ్లతో కూడిన మెమొరాండంను ఐ అండ్ పీఆర్ అడిషనల్ డైరెక్టర్ జగన్ కు సమర్పించారు. దీనిపై ఆయన స్పందిస్తూ మెమొరాండంలో పేర్కొన్న సమస్యలను కమిషనర్, మీడియా అకాడమీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్య్రమంలో డీజేఎస్ ప్రధాన కార్యదర్శి కేఎన్ రాజారామ్, ట్రెజరర్ వి.వెంకటరమణ, జాయింట్ సెక్రటరీ కనపర్తి రమేశ్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి,పద్మ, సంఘం ప్రతినిధులు సిలివేరు వెంకటేశం, చల్లా సైదిరెడ్డి, రమేశ్, అశోక్, రమేశ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.