
ట్రెయిన్ బయలుదేరడానికి ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే టైమ్ ఉంది.. అర్జెంట్‌గా ఊరెళ్లాలి.. రిజర్వేషన్ దొరుకుతుందా? అని చాలా మంది కంగారు పడుతుంటారు. ఇండియన్ రైల్వేస్ తెచ్చిన ’15-మినిట్స్ కరెంట్ బుకింగ్’ ఫెసిలిటీతో ఇది ఇప్పుడు చిటికెలో సాధ్యమవుతోంది. సదరన్ రైల్వే జోన్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ స్మార్ట్ ఐడియా సూపర్ హిట్ అయింది. రైలు బయలుదేరే ఆఖరి 15 నిమిషాల ముందు వరకు ఖాళీ సీట్లను బుక్ చేసుకునే సదుపాయం కల్పించడంతో.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఆక్యుపెన్సీ ఏకంగా 100 శాతం దాటి దూసుకుపోతోంది. లాస్ట్ మినిట్ ట్రావెలర్లకు ఇదొక వరంలా మారడమే కాక రైల్వే ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తోంది.
ఈ చిన్న మార్పు సదరన్ రైల్వేస్ ఆదాయాన్ని, ప్రయాణికుల సంఖ్యను ఊహించని రేంజ్‌కు తీసుకెళ్లింది. ఆర్థిక సంవత్సరం 2024-25లో 54.12 లక్షల మంది ప్రయాణికులతో రూ.540 కోట్ల ఆదాయం రాగా.. 2025-26 నాటికి అది ఏకంగా 77.38 లక్షల మంది ప్రయాణికులకు, రూ.803 కోట్ల ఆదాయానికి పెరిగింది. అంటే కేవలం ఏడాదిలోనే ఆదాయం దాదాపు 49 శాతం గ్రో అయ్యింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో కేవలం మొదటి రెండు నెలల్లోనే 15.21 లక్షల మంది వందే భారత్ ఎక్కగా.. రైల్వేకు రూ.163 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.
►ALSO READ | ఇండియాలో పెట్రోల్ బంకు పుట్టి 98 ఏళ్లు.. అప్పట్లో ఇంధనం ఎలా నింపేవారో తెలుసా?
అసలు ఈ మ్యాజిక్ ఎలా జరిగిందంటే.. జూలై 2025లో మొదటగా కేవలం 8 వందే భారత్ రైళ్లలో ఈ 15 నిమిషాల కరెంట్ బుకింగ్ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. కేవలం ఆగస్టు-అక్టోబర్ 2025 మధ్య 3 నెలల్లోనే కరెంట్ బుకింగ్ ద్వారా ప్రయాణించే వారి సగటు సంఖ్య నెలకు 16,729 నుంచి ఏకంగా 30,267 అంటే 80.93 శాతానికి పెరిగింది. దీని ద్వారా వచ్చే నెలవారీ సగటు ఆదాయం కూడా 78% జంప్ అయింది. ముఖ్యంగా తిరువనంతపురం-మంగళూరు, చెన్నై ఎగ్మూర్-నాగర్‌కోయిల్ రూట్లలో ప్రయాణికులు ఈ అవకాశాన్ని విపరీతంగా వాడేసుకున్నారు.
ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్‌తో ఉత్సాహపడ్డ రైల్వే అధికారులు.. ఇప్పుడు సదరన్ రైల్వే పరిధిలోని అన్ని 17 వందే భారత్ రైళ్లకు ఈ 15 నిమిషాల కరెంట్ బుకింగ్ రూల్‌ను పొడిగించారు. రైలు బయలుదేరే మెయిన్ స్టేషన్‌తో పాటు.. దారిలో ఉండే ఎన్‌రూట్ స్టేషన్లలో కూడా ఈ సదుపాయం ఉండటం ప్రయాణికులకు బాగా ప్లస్ అయింది. ఫలితంగా ఏప్రిల్-మే 2025లో కరెంట్ బుకింగ్ రెవెన్యూ రూ.444.28 లక్షలుగా ఉంటే.. ఏప్రిల్-మే 2026 నాటికి అది రెండింతలు పెరిగి రూ.1,013.50 లక్షలకు చేరింది. రైల్వేస్ టైమింగ్ మార్చకపోయినా, టికెట్ రేట్లు పెంచకపోయినా.. కేవలం ‘టైమ్ మేనేజ్‌మెంట్’ తో కోట్లు సంపాదించవచ్చని ఈ ఐడియా నిరూపించింది.