Reading Time: 2 minutes
Tilak Varma Enters Unwanted Record List Despite Fighting Fifty Vs Ireland India Vs Ireland 2026

Tilak Varma Creates Unwanted Milestone Despite Heroic Knock vs Ireland: ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ యువ బ్యాటర్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేశాడు. 46 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సుతో 55 రన్స్ చేశాడు. తిలక్ హాఫ్ సెంచరీ చేసినా భారత్ గట్టెక్కలేకపోయింది. ఆదివారం బెల్‌ఫాస్ట్‌లో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్ కేవలం ఒక పరుగు తేడాతో ఓడిపోయి.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. అయితే ఈ ఇన్నింగ్స్‌తో తిలక్ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత నెమ్మదిగా అర్ధ శతకం చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో అతడు చోటు దక్కించుకున్నాడు.

155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. భారత సంతతి ఆటగాడు జై ముంద్రా తొలి ఓవర్‌లోనే సంజు శాంసన్, అభిషేక్ శర్మలను గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్‌కు పంపించాడు. అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా త్వరగా ఔటవడంతో.. భారత్ తీవ్ర ఒత్తిడిలో పడింది. పవర్‌ప్లేలోనే 35 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయిన సమయంలో తిలక్ వర్మ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశాడు. పిచ్‌పై బంతి స్వింగ్, సీమ్, అసమాన బౌన్స్ ఉండటంతో మిగతా బ్యాటర్లు ఇబ్బందిపడగా.. తిలక్ మాత్రం ఓపికగా ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. అక్షర్ పటేల్‌తో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌ను మ్యాచ్‌లో నిలబెట్టాడు.

చెత్త రికార్డుల జాబితాలో తిలక్:
తిలక్ వర్మ 45 బంతుల్లో తన అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యంత నెమ్మదిగా నమోదైన అర్ధశతకాల జాబితాలో సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు. ఐర్లాండ్‌పై ఓ భారత బ్యాటర్ నమోదు చేసిన అత్యంత నెమ్మదైన టీ20 అర్ధ శతకం కూడా ఇదే కావడం విశేషం. 2022లో దక్షిణాఫ్రికాపై కేఎల్ రాహుల్ 56 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. గౌతమ్ గంభీర్ (54), సూర్యకుమార్ యాదవ్ (49), విరాట్ కోహ్లీ (48, 45)లు తిలక్ కంటే ముందున్నారు.

భారత్ తరఫున అత్యంత నెమ్మదైన టీ20 హాఫ్ సెంచరీ:
56 – కేఎల్ రాహుల్ vs దక్షిణాఫ్రికా (2022)
54 – గౌతమ్ గంభీర్ vs ఆస్ట్రేలియా (2012)
49 – సూర్యకుమార్ యాదవ్ vs అమెరికా (2024)
48 – విరాట్ కోహ్లీ vs దక్షిణాఫ్రికా (2024)
45 – విరాట్ కోహ్లీ vs పాకిస్థాన్ (2021)
45 – తిలక్ వర్మ vs ఐర్లాండ్ (2026)