Reading Time: 3 minutes

ఆధ్యాత్మికం : అలాంటి వాళ్లు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు.. ఇతరులతో పంచుకోని వాడు దొంగ..!

Caption of Image.

నిస్వార్థ సేవ చేసే జీవాత్మల వల్లే   ఈ విశ్వమంతా  నడుస్తుంది. ఈ  నిస్వార్థం మరమాత్మ తత్వం నుంచే పుట్టింది.మనం ప్రకృతిలో దేన్ని పరిశీలించి చూసినా అది నిస్వార్థంగానే ఉంటుంది. కేవలం మనిషి మాత్రమే వీటన్నింటి కంటే డిఫరెంట్ గా ఉంటాడు. మొదటి నుంచి చెడు మార్గంలో ప్రయాణించడం వల్ల స్వార్థంగా బతకడానికి అలవాటు పడ్డాడు. కాబట్టే, రకరకాల కష్టాల్ని, అంతులేని దుఃఖాల్ని ఎదుర్కొంటూ బాధపడుతున్నాడు.

సృష్టిని చూసి మనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కటి నిస్వార్థంగా ఇచ్చేయాలి. ఉదాహరణకు చెట్లను తీసుకుంటే.. అవి గాలి, వెలుతురు, నీళ్లను తీసుకుని.. మనకు ఫుడ్, ఆక్సిజన్, నీడను అందిస్తాయి. ఈ సృష్టిలో ఉన్నవాటిలో వేటిని చూసినా.. అవి ఏదో ఒక రూపంలో తిరిగి ఈ సృష్టికే ఇచ్చేస్తుంటాయి. అలాగే, ఈ ప్రకృతి నుంచి, ప్రపంచం నుంచి, పేరెంట్స్ నుంచి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నుంచి మనం చాలా తీసుకుంటాం. కానీ, బదులుగా వాళ్లకు ఒక అర్ధ వంతమైన దారిలో ఏదో ఒకటి తిరిగి ఇవ్వడంలో ఫెయిల్ అవుతాం. మనం ఒక స్థితికి చేరడానికి ఎంతోమంది టీచర్స్ కారణం అవుతారు. వాళ్లు మనకు ఎంతో జ్ఞానాన్ని ఇస్తారు. మనల్ని ఎక్స్పర్ట్  గా తయారు చేస్తారు. కానీ, మనం మాత్రం వాళ్లు ఇచ్చిన జ్ఞానంలో కొంచెమైనా ఇతరులకు పంచడాన్ని నిర్లక్ష్యం చేస్తాం.

ప్రోత్సాహం ఎందరిదో..
జీవితం ఒక సుదూర ప్రయాణం. ఆ ప్రయాణంలో అడుగడుగునా జీవితాంతం మనల్ని ఎంతోమంది ఎంకరేజ్ చేస్తుంటారు. ఎంతోమంది మనకు సాయం చేస్తుంటారు.. గైడ్ చేస్తుంటారు.. అన్నీ తీసుకుంటున్నాం కదా? మనలో ఎంతమంది ఇతరుల జీవిత ప్రయాణానికి సాయం చేస్తున్నాం? ఇలాంటి ప్రశ్నలు మనకు మనమే వేసుకోవాలి. నిజాయితీగా మనల్ని మనం అన్వేషించుకోవాలి. అప్పుడే, ఆపదలో, అవసరంలో ఉన్నవాళ్లకు సాధ్యమైనంత సాయం చేయగలుగుతాం. ఒకవేళ అందరికీ సాయం చేయడం చేతకాకపోతే.. కనీసం మనకు సాయం చేసినవాళ్లనైనా గుర్తుంచుకొని సాయం చేస్తాం. మనం ఎప్పుడైతే ఇతరుల నుంచి తీసుకోవడం మొదలు పెడతామో… అప్పుడే ఇతరులకు తిరిగి ఇవ్వాలనే బాధ్యత తాలూకు సోయి మనలో మొదలవ్వాలి.

ఇవ్వడం మన బాధ్యత
ఎప్పుడైనా సరే… ఈ సృష్టి నుంచి, ఈ కమ్యూనిటీ నుంచి, సొసైటీ నుంచి, ఈ దేశం నుంచి ఏదైనా తీసుకున్నారంటే.. ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా తిరిగి ఇవ్వడం మన బాధ్యత. ఉదాహరణకు పేరెంట్స్ అన్కండిషనల్ గా మనల్ని ప్రేమిస్తారు. తిరిగి వాళ్లను ప్రేమించడం, బాగా చూసుకోవడం మన బాధ్యత.

ALSO READ : జ్యోతిష్యం: పూజామందిరంలో ఈ ఒక్కటి ఉంచండి.. డబ్బులకు ఇబ్బందే ఉండదు..!

ఆయన సర్వజ్ఞుడు
మనం పవిత్ర గ్రంథాలు చదివినప్పుడు.. భగవంతుడు సర్వజ్ఞుడని, సర్వ శక్తులు కలిగి ఉన్న ఆయన ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడని రియలైజ్ అవుతాం. అంటే, ఈ విశ్వంలో ఉన్న సంపద అంతా ఆయనదే. ఆయన లేని అణువు లేదు. మనకున్నదంతా ఆ సుప్రీం పవర్ నుంచి వచ్చిందే! ఆయన ఎందులోనైతే ఉన్నాడో… దాన్నే మనం ఆయనకు సమర్పిస్తున్నాం. మనం తీసుకున్నదాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చేయాలి. అప్పుడే సృష్టి చక్రం బ్యాలెన్స్ అవుతుంది.

కర్మయోగులు కావాలి
ఇలా చేస్తే నాకేం వస్తుంది..? నాకేంటి..? అనే దారిలో ఆలోచిస్తుంటారు చాలామంది. చేస్తున్న పని తాలూకు ఫలితాలపై ఆశ లేకుండా నిస్వార్ధంగా పని చేయడమే నిష్కామకర్మ. ఈ నిష్కామకర్మనే కర్మయోగ అని పిలుస్తాడు గీతలో కృష్ణుడు. కర్మకు, కర్మ తాలూకు ఎక్సపెక్టేషన్స్ కి, ఫలితాల కు అటాచ్ కాకుండా ఉండటమే కర్మయోగం. పనికి సంబంధించి లాభం, పుణ్యం లాంటివి లేకుండా ఉండటమే కర్మయోగం. ఫలితం కోరకుండా పని చేయడం వల్ల మనసు నెమ్మదిగా పవిత్రంగా మారుతుంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మంచిపనులు చేస్తున్నపుడు మనసు ప్రశాంతంగా, సంతృప్తిగా ఉంటుంది. ఫైనల్ గా కర్మచేస్తున్నా కూడా దాని ఫలితం నుంచి తప్పించుకోవడమే కర్మయోగం. కర్మయోగి కాని వాడు.. తన సొంత లాభం కోసం స్వార్థంగా బతుకుతూ జనన, మరణ చక్రంలో పడి తిరుగుతుంటాడు. ఇతనికి మోక్షం ఉండదు. కర్మయోగి ప్రపంచ శ్రేయస్సు కోసం.. సర్వం ఆ సర్వజ్ఞుడికే సమర్పిస్తున్నాననే సోయితో పని చేస్తుంటాడు. ‘పరమాత్మ, కాస్మిక్ పవర్లో భాగంగా..నేను ఆయన చేతిలో ఒక పనిముట్టుని’ అని భావిస్తూ పని చేస్తాడు. కర్మయోగులే.. తాము తీసుకున్నది ఈ లోకానికి తిరిగిచ్చి… లోకాత్మలో కలిసిపోతారు!

పంచుకోని వాడు దొంగ
‘నిస్వార్థమైన ప్రవర్తనతో.. మనకన్నా పైస్థాయిలో ఉన్నవాళ్లను సేవించాలి’ అని భగవద్గీతలోని మూడో అధ్యాయంలో కృష్ణుడు, అర్జునుడికి చెప్తాడు. ఉదాహరణకు.. స్టూడెంట్ కంటే టీచర్ ఉన్నత స్థానంలో ఉంటాడు. కాబట్టి, తనకు జ్ఞానాన్ని పంచిన గురువుకి.. స్టూడెంట్ నిస్వార్థంగా సేవ చేయాలి. గురు- శిష్యులు నిస్వార్థంగా ఉన్నప్పుడు ఇద్దరూ సమర్థవంతంగా పని చేస్తారు. ఇద్దరూ కలిసి ఎదుగుతారు. అలాగే, పేరెంట్స్ కూడా తమ పిల్లలు ఎదిగేందుకు బాధ్యతగా ఎన్నో రకాలుగా సాయపడతారు, సేవ చేస్తారు. దాన్ని గుర్తించి పిల్లలు తిరిగి పేరెంట్స్ కి ఇవ్వగలిగితే.. ఆ ఫ్యామిలీ మొత్తం ఉన్నత స్థితిలో ఉంటుంది. భగవద్గీత మూడో అధ్యాయం, పన్నెండో శ్లోకంలో “ఎప్పుడూ ఇతరుల నుంచి తీసుకోవడమే కానీ, తన దగ్గర ఉన్నది ఇతరులతో పంచుకోని వాడు దొంగ” అంటాడు కృష్ణుడు. “ఎవరైతే తన సమాజం గురించి ఆలోచన చేయకుండా కేవలం తనకోసమే పని చేస్తారో, వాళ్లు పాపాలను పోగేసుకుంటారు. అలాంటి వాళ్లకు శాంతి ఉండదు. ఎప్పుడూ దుఃఖంలోనే మునిగి ఉంటారు”అని తర్వాతి శ్లోకంలో కొనసాగిస్తాడు గోపాలుడు.

©️ VIL Media Pvt Ltd.