
ఈరోజుల్లో రోడ్డు మీదకు వస్తే దారి పొడవునా ప్రతి 10 నిమిషాలకు ఒక పెట్రోల్ బంక్ కనిపిస్తున్నాయి. నాజిల్ పెట్టడమే ఆలస్యం.. ఎంత పెట్రోల్ పడిందో, ఎంత బిల్లు అయిందో స్క్రీన్ మీద డిజిటల్‌గా ఇట్టే తెలిసిపోతుంది. అసలు భారతదేశంలో మొట్టమొదటి పెట్రోల్ పంప్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అప్పట్లో అస్సలు టెక్నాలజీ లేని రోజుల్లో పెట్రోల్ ఎలా కొలిచి పోసేవాళ్లో తెలుసా? దాని వెనుక ఓ ఇంట్రెస్టింగ్ హిస్టరీ గురించి తెలుసుకుందాం రండి..
మన దేశంలో మొట్టమొదటి పెట్రోల్ పంప్ దాదాపు 98 సంవత్సరాల క్రితం ‘బాంబే’ నగరంలో ప్రారంభమైంది. అప్పట్లో రోడ్ల మీద కార్లు, బైకులు చాలా అరుదుగా ఉండేవి. కేవలం ధనవంతులు, రాజుల దగ్గర మాత్రమే వాహనాలు ఉండే ఆ రోజుల్లో.. ‘బర్మా షెల్’ కంపెనీ ఈ సాహసోపేతమైన అడుగు వేసింది. దేశంలోనే మొదటి పబ్లిక్ ఫ్యూయల్ స్టేషన్‌ను ఏర్పాటు చేసిన ఘనత ఈ సంస్థకే దక్కుతుంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జాతీయీకరణ ప్రక్రియలో భాగంగా ఈ కంపెనీ ప్రస్తుత భారత్ పెట్రోలియంలో కలిసిపోయింది.
ఈ మొదటి పెట్రోల్ బంక్ రాకముందు వాహనదారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అప్పట్లో పెట్రోల్‌ను పెద్ద పెద్ద డ్రమ్ములు, ఇనుప టిన్నుల్లో పోసి అమ్మేవారు. దానివల్ల పెట్రోల్ కొనుగోలు చేయడం చాలా కష్టంగా ఉండేది. అయితే ముంబైలో మొదటి పంప్ అందుబాటులోకి వచ్చాక ఆ ఇబ్బందులు తప్పాయి. కానీ అప్పట్లో ఇప్పుడున్నట్టు ఆటోమేటిక్ మెషీన్లు లేవు. బంక్ సిబ్బంది ‘హ్యాండ్-హెల్డ్ డిస్పెన్సర్లు’ అంటే చేత్తో తిప్పే పంపులను వాడేవారు. పెట్రోల్ ఎంత క్వాంటిటీ వచ్చిందో కొలవడానికి మెకానికల్ మీటర్లను ఉపయోగించేవారు.
ALSO READ : రూపాయి, రెండు రూపాయలు కాదు..
ఆ రోజుల్లో డిజిటల్ స్క్రీన్లు లేవు కాబట్టి.. కస్టమర్లకు సరైన క్వాంటిటీలో పెట్రోల్ వస్తుందా లేదా అనే నమ్మకం కలిగించడం పెద్ద సవాలుగా ఉండేది. ఈ ట్రాన్స్‌పరెన్సీ సమస్యను దాటడానికి బర్మా షెల్ కంపెనీ తర్వాతి రోజుల్లో ప్రత్యేక పరికరాలను ప్రవేశపెట్టింది. దీనివల్ల కస్టమర్లు తమ కళ్ల ముందే ఎంత పెట్రోల్ వస్తుందో లైవ్‌గా చూసే వీలు కలిగింది. అలా నమ్మకంతో మొదలైన ఆనాటి మెకానికల్ పంప్.. ఈరోజు మనం చూస్తున్న అత్యాధునిక డిజిటల్ పెట్రోల్ బంకులకు బలమైన పునాది వేసింది.