
Arrears Release: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బకాయిల చెల్లింపుల కోసం కాంగ్రెస్ సర్కార్ తాజాగా మరో రూ. 2,000 కోట్ల నిధులను విడుదల చేసింది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఈ బకాయి నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే గత నెల 29వ తేదీన మొదటి విడత కింద రూ. 2,000 కోట్ల బకాయి నిధులను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన రెండో విడత రూ. 2,000 కోట్లతో కలిపి ఇప్పటివరకు మొత్తం రూ. 4,000 కోట్ల ఉద్యోగుల పెండింగ్ బకాయిలను ప్రభుత్వం క్లియర్ చేసినట్లయింది. దశలవారీగా అన్ని రకాల ఉద్యోగ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా అధికార వర్గాలు వెల్లడించాయి.