Reading Time: 2 minutes
Indian Railways: చాలా మందికి తెలియని రైల్వే పాసులు.. ఒక్కసారి తీసుకుంటే అతి తక్కువ ఛార్జీతో జర్నీ.. డబ్బు ఆదా!

భారతీయ రైల్వే కొన్ని ప్రత్యేక వర్గాల ప్రయాణికులకు టికెట్ ఛార్జీలపై రాయితీలు అందిస్తోంది. ఒకప్పుడు వృద్ధులు సహా అనేక వర్గాలకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండగా, ప్రస్తుతం పరిమిత వర్గాల వారికి మాత్రమే ఈ ప్రయోజనం కొనసాగుతోంది. ముఖ్యంగా దివ్యాంగులు, కొన్ని తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న రోగులు, అలాగే నిర్దిష్ట పరిస్థితుల్లో ప్రయాణించే విద్యార్థులు ఈ రాయితీలకు అర్హులవుతారు. ప్రస్తుతం భారతీయ రైల్వే నాలుగు వర్గాల దివ్యాంగులకు, 11 రకాల వ్యాధులతో బాధపడుతున్న రోగులకు, ఎనిమిది వర్గాల విద్యార్థులకు టికెట్ ఛార్జీలలో రాయితీ కల్పిస్తోంది. ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, స్టడీ టూర్లు, పరిశోధన కార్యక్రమాల కోసం ప్రయాణించే విద్యార్థులు ఈ జాబితాలో ఉంటారు. అలాగే దృష్టి లోపం ఉన్నవారు, శారీరక వైకల్యం కలిగినవారు, క్యాన్సర్, క్షయవ్యాధి (టీబీ), మూత్రపిండాల వ్యాధులు, అంటువ్యాధి కాని కుష్టు వ్యాధి, తలసేమియా వంటి సమస్యలతో బాధపడుతున్న రోగులు కూడా రాయితీలను పొందవచ్చు.

రైల్వే నిబంధనల ప్రకారం ఈ రాయితీలు సాధారణంగా ప్రాథమిక ఛార్జీపై వర్తిస్తాయి. చాలా సందర్భాల్లో కనీసం 300 కిలోమీటర్ల ప్రయాణానికి మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. అయితే పరీక్షలకు వెళ్లే విద్యార్థులు లేదా చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్లే క్యాన్సర్ రోగులు వంటి కొన్ని ప్రత్యేక వర్గాలకు ఈ దూర పరిమితి వర్తించదు. ఇలాంటి రాయితీ టిక్కెట్లతో ప్రయాణించే వారు మధ్యలో ప్రయాణాన్ని నిలిపివేయడం లేదా గమ్యస్థానాన్ని మార్చుకోవడం సాధ్యం కాదు.

ఇది కూడా చదవండి: కేవలం రూ.50లతో రూ.35 లక్షలు పొందే ఛాన్స్! మిస్ అయితే నష్టపోతారు..

అయితే అన్ని రైళ్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉండదు. రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ది, దురంతో, వందే భారత్, గతిమాన్, గరీబ్ రథ్, హమ్‌సఫర్, ప్రత్యేక రైళ్లు, సీజన్ టికెట్లు, సర్క్యులర్ జర్నీ టికెట్లపై సాధారణంగా ఈ రాయితీలు వర్తించవు. ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునే ముందు సంబంధిత నిబంధనలను పరిశీలించడం మంచిది. దివ్యాంగులు రాయితీ పొందేందుకు ముందుగా ప్రత్యేక గుర్తింపు పాస్ తీసుకోవాలి. ఇందుకోసం భారతీయ రైల్వే ఏర్పాటు చేసిన Divyangjan ID పోర్టల్‌లో దరఖాస్తు చేసి, అవసరమైన ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి. రైల్వే అధికారులు వాటిని పరిశీలించి ఆమోదించిన తర్వాత డిజిటల్ ఐడీ జారీ చేస్తారు. ఆ ఐడీతో ఆన్‌లైన్‌లో కూడా రాయితీ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. వైద్య రాయితీ పొందే రోగులు సంబంధిత ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన వైద్యాధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి