Reading Time: 2 minutes
Nagababu Key Comments On Araku Politics Janasena Plans To Contest All Assembly Seats

Nagababu: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ సరికొత్త వ్యూహాలతో ముందుకు పోయేలా కనపడుతోంది. తాజాగా జనసేన పార్టీ నాయకుడు నాగబాబు అరకు పార్లమెంట్ పరిధిలోని రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, వారి సంక్షేమమే ధ్యేయంగా జనసేన పనిచేస్తోందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో అరకు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులను నిలబెట్టేందుకు 100% ప్రణాళికలు సిద్ధం చేస్తోందని నాగబాబు అన్నారు. పార్లమెంట్ స్థానంతో పాటు దాని పరిధిలోకి వచ్చే అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తూ, గరిష్ట స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

గిరిజన హక్కుల పరిరక్షణకు, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖను ప్రత్యేకంగా ఎంచుకున్నారని నాగబాబు తెలిపారు. ఈ శాఖ ద్వారా గిరిజన గ్రామాల అభివృద్ధికి అనేక నిధులు కేటాయించినట్లు గణాంకాలతో సహా వివరించారు. ఇందులో ‘అడవితల్లి బాట’ కార్యక్రమం ద్వారా గిరిజన ఆవాసాలకు రహదారులు నిర్మించేందుకు దాదాపు 1,005 కోట్ల రూపాయలను ఖర్చు చేసి.. సుమారు 1,069 కిలోమీటర్ల పొడవైన రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు.

అలాగే పీఎం జన్మన్ నిధుల (PM Janman) నుండి 555 కోట్లు కేటాయించారని, ఇంకా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అత్యధికంగా 2,525 కోట్ల రూపాయలను ఈ ప్రాంతాల అభివృద్ధికి వెచ్చించారని తెలిపారు. వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున దాదాపు 50 కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు ఆయన వివరించారు. ఈ భారీ నిధుల ద్వారా గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యాలు (Water works), అంతర్గత రహదారుల వంటి మౌలిక వసతులను కల్పించడమే కాకుండా.. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపట్టేందుకు బలమైన ప్రణాళికలు ఉన్నాయని ఆయన తెలిపారు. కురుడి, డుంబ్రిగూడ, బల్లగరువు, పోతంగి, అనంతగిరి, పాడేరు, అరకు, పెద్దబాడు వంటి ఎన్నో గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యటించి అక్కడి సమస్యలపై పూర్తి అవగాహన తెచ్చుకున్నారని నాగబాబు తెలిపారు.

బాక్సైట్ మైనింగ్, హైడ్రోపవర్ ప్రాజెక్టుల వంటి సాంకేతిక విషయాలపై తనకు పూర్తి అవగాహన లేకపోయినప్పటికీ, ప్రకృతికి ఎటువంటి నష్టం వాటిల్లినా పవన్ కళ్యాణ్ అస్సలు సహించరని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణానికి, గిరిజన జీవన విధానానికి హాని కలిగించే ఏ నిర్ణయాన్నైనా పవన్ కళ్యాణ్ ఎంతమాత్రం ఆమోదించరని, ప్రకృతిని కాపాడుకుంటూనే గిరిజనుల హక్కులను కాపాడటానికి జనసేన ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని నాగబాబు మరోసారి గుర్తుచేశారు.