July 11, 2026

Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!

Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
Reading Time: 2 minutes
Crispy Ragi Murukku Recipe Healthy Tea Time Snack Finger Millet Jantikalu

Crispy Ragi Murukku: సాయంత్రం టైంలో టీతో పాటు ఏదైనా కరకరలాడే స్నాక్స్ తినాలనిపిస్తే, ఆరోగ్యానికి మేలు చేసే రాగి పిండి మురుకులు ఒక అద్భుతమైన ఎంపిక తెలుసా. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ మురుకులను కేవలం 15 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

రాగి పిండి: 3 కప్పులు (సుమారు 370 గ్రాములు)

పుట్నాల పప్పు పిండి: 1 కప్పు (మెత్తగా గ్రైండ్ చేసి జల్లెడ పట్టినది)

బియ్యప్పిండి: అర కప్పు (క్రిస్పీగా రావడం కోసం)

కారం: 1.5 టీస్పూన్

ఉప్పు: రుచికి సరిపడా

వాము: 1 టీస్పూన్ (నలిపి వేయాలి)

తెల్ల నువ్వులు: పావు కప్పు

ఇంగువ: అర టీస్పూన్

వేడి చేసిన నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు (నెయ్యి ఇష్టం లేని వారు నూనె వాడుకోవచ్చు)

నీళ్లు: తగినన్ని

నూనె: డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం..
ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో రాగి పిండిని తీసుకోండి. అందులోకి మెత్తగా గ్రైండ్ చేసిన పుట్నాల పప్పు పిండిని జల్లెడ పట్టి వేయాలి. దీంతో మురుకులకు మంచి రుచి వస్తుంది. ఆ తర్వాత బియ్యప్పిండి, కారం, ఉప్పు, వాము, నువ్వులు, ఇంగువ వేసి బాగా కలపాలి. తర్వాత అందులో బాగా వేడి చేసిన రెండు స్పూన్ల నెయ్యిని వేసి కలపాలి. పిండిని చేత్తో పట్టుకుంటే ముద్దలా అవ్వాలి, అప్పుడే మురుకులు కరకరలాడుతూ వస్తాయి. ఒకవేళ ముద్ద అవ్వకపోతే మరికొంచెం నెయ్యి లేదా నూనె వేయండి. తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి. రాగి పిండి కాబట్టి పిండి కొంచెం మెత్తగా ఉంటేనే మురుకులు వేసేటప్పుడు విరిగిపోకుండా వస్తాయి.

పిండి కలుపుకోవడం పూర్తి అయిన తర్వాత మురుకుల గొట్టానికి (జంతికల గొట్టం) కొంచెం నూనె రాసి, తగినంత పిండిని అందులో ఉంచాలి. నేరుగా నూనెలో వేయడం రాని వారు, ఒక చిల్లుల గరిటె వెనుక వైపు నూనె రాసి, దానిపై రౌండ్‌గా మురుకులా చుట్టుకోవాలి. బాగా వేడెక్కిన నూనెలో సిద్ధం చేసుకున్న మురుకులను మెల్లగా వదలాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి రెండు వైపులా చక్కగా వేయించాలి. నూనెలో నురగ తగ్గిపోయిందంటే మురుకులు పర్ఫెక్ట్‌గా వేగినట్లే. మురుకులు వేసే ప్రతిసారి పిండి ఆరిపోకుండా చూసుకోవాలి. పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు చల్లి కలుపుకోవాలి. వీటిని గాలి తగలని డబ్బాలో నిల్వ చేసుకుంటే నెల రోజుల వరకు తాజాగా, కరకరలాడుతూ ఉంటాయి. ఇందులో రుచితో పాటు క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కుదిరితే ఈ రాగి మురుకులను మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి.