Yogini Ekadashi: యోగిని ఏకాదశినాడు ఈ ఒక్క వ్రతంతో జన్మజన్మల పాపాలు నశిస్తాయా? పారణ సమయం ఇదే

Ekadashi Vrat Katha: హిందూ ధర్మంలో ప్రతి ఏకాదశి తిథికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ పవిత్రమైన రోజున ఉపవాసం, జాగరణ, విష్ణు నామస్మరణ, దానధర్మాలు ఆచరించడం ద్వారా పాపక్షయం కలిగి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శుభఫలితాలు సిద్ధిస్తాయని పురాణాలు పేర్కొంటాయి. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో జ్యేష్ఠ మాస కృష్ణపక్ష ఏకాదశిని యోగిని ఏకాదశిగా ఆరాధిస్తారు.
యోగిని ఏకాదశి ఎప్పుడు?
తెలుగు పంచాంగం ప్రకారం (శుక్రవారం, జూలై 10న) జ్యేష్ఠ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశినే యోగిని ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించి ఉపవాస దీక్షను ఆచరించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.
యోగిని ఏకాదశి విశిష్టత
పద్మపురాణం, మహాభారతం వంటి పురాణ గ్రంథాల ప్రకారం యోగిని ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారికి అనేక జన్మల పాపాలు నశిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక బాధలు తొలగి భగవంతుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా వేలాది మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు వివరిస్తాయి.
హేమాలి గంధర్వుని కథ
యోగిని ఏకాదశి మహిమను తెలియజేసే ప్రసిద్ధ గాథ హేమాలి గంధర్వునిది..
అలకాపురిని పాలించే కుబేరుడు పరమశివ భక్తుడు. ఆయన నిత్య శివారాధన కోసం సేవకుడైన హేమాలి ప్రతిరోజూ మానస సరోవరం నుండి దివ్య పుష్పాలను తీసుకొచ్చేవాడు. ఒకసారి తన భార్యతో విహారంలో మునిగిపోయిన హేమాలి పూజకు పుష్పాలు తీసుకురావడం మరిచిపోయాడు. భగవంతుని సేవలో నిర్లక్ష్యం చూపినందుకు ఆగ్రహించిన కుబేరుడు, హేమాలిని భార్యకు దూరమై కుష్ఠు వ్యాధితో బాధపడాలని శపించాడు. శాపగ్రస్తుడైన హేమాలి భూలోకానికి వచ్చి తీవ్ర వేదన అనుభవిస్తూ సంచరిస్తున్న సమయంలో మహాతపస్వి మార్కండేయ మహర్షిని దర్శించాడు.
మార్కండేయ మహర్షి ఉపదేశం
తన దుస్థితిని వివరించి శాప విమోచనానికి మార్గం చూపమని వేడుకున్న హేమాలిపై మార్కండేయ మహర్షి కరుణ చూపాడు. ఆయన యోగిని ఏకాదశి వ్రత మహిమను వివరిస్తూ, నియమ నిష్ఠలతో ఈ వ్రతాన్ని ఆచరించాలని సూచించాడు. హర్షి ఆదేశాన్ని పాటించిన హేమాలి భక్తిశ్రద్ధలతో యోగిని ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించాడు. వ్రత ప్రభావంతో కుబేరుని శాపం తొలగి, కుష్ఠు వ్యాధి నుండి విముక్తి పొంది తిరిగి స్వర్గలోకానికి చేరుకున్నాడని పురాణాలు తెలియజేస్తాయి.
యోగిని ఏకాదశి వ్రత విధానం
యోగిని ఏకాదశి రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకోవాలి. అనంతరం శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ భక్తితో ఉపవాస సంకల్పం చేయాలి. పూజామందిరంలో ఆవు నెయ్యితో దీపారాధన చేసి, పంచామృతాలతో శ్రీహరికి అభిషేకం నిర్వహించాలి. తులసి దళాలు, పసుపు రంగు పుష్పాలతో పూజించాలి. విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణు అష్టోత్తర శతనామావళి, గోవింద నామస్మరణ చేయడం శ్రేష్ఠంగా భావిస్తారు.
నైవేద్యంగా పాయసం, కొబ్బరికాయ, అరటిపండ్లు సమర్పించి యోగిని ఏకాదశి వ్రత కథను వినడం లేదా చదవడం శుభప్రదం.
ఆలయ దర్శనం – జాగరణ
ఇంటి పూజ అనంతరం సమీపంలోని శ్రీ మహావిష్ణు ఆలయాన్ని దర్శించి తులసి మాలను సమర్పించడం ఉత్తమం. రాత్రి శ్రీహరి నామసంకీర్తన, భజనలు, విష్ణు పురాణ పఠనం లేదా గీతా పారాయణంతో జాగరణ చేయడం అత్యంత పుణ్యప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి.
తులసి పూజ ప్రత్యేకత
యోగిని ఏకాదశి సాయంత్రం తులసి కోట వద్ద నెయ్యి దీపం వెలిగించి, భక్తితో 11 ప్రదక్షిణలు చేస్తే కుటుంబంలో శాంతి, సౌభాగ్యం, ఐశ్వర్యం పెరుగుతాయని విశ్వాసం. తులసి దళాలను శ్రీమహావిష్ణువుకు సమర్పించడం ఈ రోజున ఎంతో విశిష్టమైన సేవగా భావిస్తారు.
ఈ రోజున చేయవలసిన దానాలు
యోగిని ఏకాదశి రోజున దానధర్మాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా: అన్నదానం, గోదానం, సువర్ణదానం, వస్త్రదానం,
తాగునీరు, పండ్లు, ఆహార పదార్థాల దానం. భక్తితో చేసిన ఈ దానాలను శ్రీహరి ఎంతో ప్రీతితో స్వీకరిస్తాడని పురాణాలు పేర్కొంటాయి.
ద్వాదశి పారణ
ఏకాదశి ఉపవాసాన్ని మరుసటి రోజు (శనివారం) ద్వాదశి తిథిలో సూర్యోదయం అనంతరం శాస్త్రోక్తంగా విరమించాలి. ముందుగా శ్రీహరికి మహానైవేద్యం సమర్పించి, సాధ్యమైనంతవరకు బ్రాహ్మణులకు లేదా అవసరమైన వారికి అన్నదానం చేయాలి. అనంతరం ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసాన్ని ముగించాలి.
యోగిని ఏకాదశి వ్రత ఫలితాలు
యోగిని ఏకాదశి వ్రతాన్ని నియమనిష్ఠలతో ఆచరించిన వారికి పురాణాల ప్రకారం అనేక శుభఫలితాలు లభిస్తాయని విశ్వసిస్తారు.
- పూర్వజన్మ పాపాలు క్షీణిస్తాయి.
- దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం కలుగుతుందని విశ్వాసం.
- కుటుంబంలో శాంతి, సుఖసంతోషాలు పెరుగుతాయి.
- ఐశ్వర్యం, సంపద, శుభయోగాలు సిద్ధిస్తాయి.
- భగవంతుని కృపతో ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది.
- చివరికి విష్ణులోక ప్రాప్తి లేదా మోక్షం లభిస్తుందని పురాణాలు వివరిస్తాయి.
చివరగా, ఏకాదశి అనేది కేవలం ఉపవాసం చేసే రోజు మాత్రమే కాదు. మనసును పవిత్రం చేసుకుని, భగవంతుని స్మరణలో గడిపే ఆధ్యాత్మిక సాధన. భక్తి, నియమం, దానం, నామస్మరణతో యోగిని ఏకాదశిని ఆచరిస్తే శ్రీమన్నారాయణుని అపారమైన అనుగ్రహం లభిస్తుందని సనాతన సంప్రదాయం విశ్వసిస్తోంది. ఈ పవిత్రమైన యోగిని ఏకాదశి సందర్భంగా శ్రీహరిని భక్తిశ్రద్ధలతో ఆరాధించి, మన జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక శ్రేయస్సు వెల్లివిరియాలని ప్రార్థిద్దాం.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)