Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!

Australia to Host IPL Match: భారత క్రికెట్‌లో త్వరలోనే ఎవరూ ఊహించని పరిణామం ఒకటి చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో తొలిసారిగా ఆస్ట్రేలియా వేదికగా ఒక మ్యాచ్ నిర్వహించే దిశగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ముందు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఉంచినట్లు సమాచారం. ఇరు బోర్డుల మధ్య ఇప్పటికే రహస్య చర్చలు జరిగాయని ఆస్ట్రేలియా న్యూస్ పేపర్ ‘ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ వెల్లడించింది.
చెన్నైలో బిగ్ బాష్:
భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ సంయుక్తంగా భారత్-ఆస్ట్రేలియా క్రీడా సహకార రోడ్ మ్యాప్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా డిసెంబర్ 12న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చేపాక్)లో మెల్‌బోర్న్ రెనిగేడ్స్, డిఫెండింగ్ ఛాంపియన్ పెర్త్ స్కోర్చర్స్ మధ్య బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) మ్యాచ్ నిర్వహించనున్నారు. భారత గడ్డపై విదేశీ క్రికెట్ లీగ్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇలా ప్రతి ఏడాది ఓ మ్యాచ్ నిర్వహించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోందని, అందుకు ప్రతిగా ఐపీఎల్‌లో ఒక మ్యాచ్‌ను ఆస్ట్రేలియాలో నిర్వహించాలంటూ బీసీసీఐని కోరినట్లు సమాచారం.
భారత్-ఆస్ట్రేలియా క్రీడా బంధానికి కొత్త అధ్యాయం:
భారత్, ఆస్ట్రేలియా కలిసి రూపొందించిన ఇండియా-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కొలాబరేషన్ రోడ్‌మ్యాప్ ద్వారా శిక్షణ, క్రీడా విజ్ఞానం, సాంకేతికత, స్పోర్ట్స్ ఇండస్ట్రీ, పెట్టుబడులు వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో విక్టోరియా ప్రీమియర్ జసింటా అలన్‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా, మాజీ మహిళా కెప్టెన్ లిసా స్థాలేకర్ కూడా పాల్గొన్నారు.
యువ క్రీడాకారులకు ప్రత్యేక ఉత్సవం:
ఈ రోడ్‌మ్యాప్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా యువ క్రీడాకారుల కోసం ప్రత్యేక యూత్ స్పోర్ట్స్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. దీని ద్వారా ఇరు దేశాల యువ అథ్లెట్ల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడంతో పాటు క్రీడా సంబంధాలను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. క్రీడలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఒక్కటిగా తీసుకువచ్చే శక్తిని కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కొత్త రోడ్‌మ్యాప్ భారత్-ఆస్ట్రేలియా క్రీడా సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టుకు అభినందనలు తెలిపారు.
అధికారిక ప్రకటన రావాల్సి ఉంది:
భారత్ 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుండగా.. 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్‌కు ఆస్ట్రేలియా సిద్ధమవుతోంది. ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించే అంశంపై ఇప్పటివరకు బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్ మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకోవడం ఖాయం.