El Nino: ఎల్‌నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్‌ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?

ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది వర్షాలుండవని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ వస్తోంది. జూన్ నెలలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురకపోవడంతో నిజమే అనుకున్నారు. 125 ఏళ్ల తర్వాత అత్యంత పొడి జూన్ నెలగా రికార్డ్ నమోదైంది. దీంతో వాతావరణ శాఖ అంచనా వేసినట్లుగానే జూలైలో కూడా వర్షాలు ఉండకపోవచ్చని అంతా భావించారు. ప్రభుత్వాలతో పాటు అన్నదాతలు ఆశలు వదులుకున్నారు. కానీ అందుకు భిన్నంగా జూలై నెల భారతదేశాన్ని వర్షాలు దంచికొడుతున్నాయి. మహారాష్ట్రలో అయితే గత వారం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కుంటలు, చెరువులు, నదులు నిండుకున్నాయి. అలాగే ఉత్తర భారత్‌లో కూడా వర్షాలు కకావికలం చేస్తున్నాయి. మరికొన్ని చోట్ల క్లౌడ్‌బరస్ట్‌లతో అల్లాడిస్తున్నాయి. ఇలా జూలై నెల ప్రారంభంలోనే ఈ స్థాయిలో వర్షాలు దంచికొడుతుంటే.. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండవచ్చో అంచనా వేయచ్చు.
శాస్త్రవేత్తల వివరణ
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు బలహీనపడతాయని, ఆలస్యంగా వస్తాయని వాతావరణ నిపుణులు భావించారు. జూన్ నెలలో రుతుపవనాలు ప్రారంభమైన తర్వాత కొంతకాలం నిలిచిపోవడంతో ఆ అంచనాలు నిజమవుతున్నట్లే కనిపించాయి. దశాబ్దాల్లోనే అత్యంత పొడి జూన్ నెలల్లో ఒకటిగా ఈసారి నమోదైంది. అయితే జూలై ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నైరుతి రుతుపవనాలు ఒక్కసారిగా చురుకుగా మారి దేశమంతా విస్తరించడంతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
జూలై నెలలో దేశవ్యాప్తంగా సాధారణానికి మించిన వర్షపాతం నమోదైంది. ముంబైలోని కొలాబా వాతావరణ కేంద్రంలో జూలై 1 నుంచి 7 వరకు 791 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ఆ నగరంలో మొత్తం జూలై నెల సగటు వర్షపాతం 768.5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ. శాంటాక్రూజ్‌లో 879 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. అక్కడ జూలై నెల సాధారణ సగటు 919.9 మిల్లీమీటర్లు.
ఢిల్లీలో కూడా జూలై 1 నుంచి 8 వరకు 39.9 మిల్లీమీటర్ల వర్షం కురవగా, ఇది సాధారణ కంటే సుమారు 23 శాతం అధికం. మధ్య భారతదేశం, ద్వీపకల్ప భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కూడా జూన్‌లో వర్షాభావం ఉన్నప్పటికీ జూలైలో అధిక వర్షాలు నమోదయ్యాయి.
ఎల్‌నినో ఉన్నా భారీ వర్షాలు ఎలా?
సాధారణంగా ఎల్‌నినో ప్రభావం భారత రుతుపవనాలను బలహీనపరుస్తుంది. దీంతో చాలామందిలో సందేహం నెలకొంది. ఎల్‌నినో ఉంటే వర్షాలు తగ్గాలి.. మరి ఇప్పుడు ఎందుకు భారీ వర్షాలు కురుస్తున్నాయి?
ఈ ప్రశ్నకు శాస్త్రవేత్తలు స్పష్టమైన వివరణ ఇస్తున్నారు. వారి ప్రకారం ఎల్‌నినో ప్రధానంగా రుతుపవనాలు ఎప్పుడు వస్తాయి, వర్షాలను తీసుకొచ్చే వాతావరణ వ్యవస్థలు ఎంత తరచుగా ఏర్పడతాయి అనే అంశాలపై ప్రభావం చూపుతుంది. కానీ ఒకసారి అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడితే ఎంత తీవ్రంగా వర్షం పడుతుందో నిర్ణయించేది మాత్రం ఎల్‌నినో కాదు.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో రుతుపవనాల స్వభావం మారిపోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంలో తరచుగా, మోస్తరు వర్షాలు కురిసేవి. ఇప్పుడు మాత్రం తక్కువ రోజులే వర్షాలు పడుతున్నా, ఒకేసారి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి.
వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ గాలి ఎక్కువ నీటి ఆవిరిని నిల్వ చేసుకోగలుగుతోంది. అదే సమయంలో అరేబియా సముద్రం, బంగాళాఖాతం కూడా వేగంగా వేడెక్కుతుండటంతో అక్కడి నుంచి అధిక మొత్తంలో తేమ వాతావరణంలోకి చేరుతోంది. ఈ తేమ అల్పపీడన వ్యవస్థలకు మరింత బలాన్ని అందిస్తోంది.
ముంబైలో భారీ వర్షాలకు కారణాలివే
ముంబైలో రుతుపవనాల ప్రవేశం ఆలస్యమవడానికి ఎల్‌నినో ఒక కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే జూలైలో కురుస్తున్న అత్యంత భారీ వర్షాలకు పశ్చిమ ఆసియాలో పెరిగిన ఉష్ణోగ్రతలు, అరేబియా సముద్రంలోని గాలుల మార్పులు కూడా కారణమయ్యాయి. అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుంచి భారీగా తేమ చేరడం, అల్పపీడన వ్యవస్థ ఏర్పడడం, పశ్చిమ కనుమల ప్రభావంతో గాలి పైకి ఎగసిపోవడం కలిసి ముంబైతో పాటు తీర మహారాష్ట్రలో కుండపోత వర్షాలకు దారితీశాయి.
శాస్త్రవేత్తల అంచనా ప్రకారం వాతావరణ మార్పుల ప్రభావంతో రుతుపవనాల స్వభావం శాశ్వతంగా మారుతోంది. గతంలా సీజన్ మొత్తం సమానంగా వర్షాలు కురవడం తగ్గి, కొద్ది రోజుల వ్యవధిలోనే భారీ వర్షాలు కురిసే పరిస్థితి పెరుగుతోంది. దీంతో పట్టణాల్లో వరదలు, నీటిమునిగే పరిస్థితులు అధికమవుతున్నాయి. దేశవ్యాప్తంగా జూన్‌లో తీవ్ర వర్షాభావం నమోదైనా.. జూలై 1 నుంచి 8 మధ్య సాధారణం కంటే 42 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వరుస అల్పపీడనాలు, చురుకైన రుతుపవన ద్రోణి ఇందుకు కారణమయ్యాయి.
వాతావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇకపై ఎల్‌నినో ప్రభావాన్ని మాత్రమే విడిగా చూడలేం. పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు, వేడెక్కుతున్న సముద్రాల ప్రభావంతో ఎల్‌నినో ఆలస్యాన్ని కలిగించినా, వర్షాలు ప్రారంభమైన తర్వాత అవి గతంతో పోలిస్తే మరింత తీవ్రంగా కురిసే అవకాశం పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు.