July 9, 2026

రైతులపై బీజేపీది కపట ప్రేమ.. కిషన్ రెడ్డి లేఖపై ఎంపీ వంశీకృష్ణ ఆగ్రహం

రైతులపై బీజేపీది కపట ప్రేమ.. కిషన్ రెడ్డి లేఖపై ఎంపీ వంశీకృష్ణ  ఆగ్రహం
Reading Time: < 1 minute

రైతులపై బీజేపీది కపట ప్రేమ.. కిషన్ రెడ్డి లేఖపై ఎంపీ వంశీకృష్ణ ఆగ్రహం

Caption of Image.

కేంద్ర ప్రభుత్వం, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులకు అండగా ఉన్నామంటూ కిషన్ రెడ్డి చెబుతున్న మాటలు పూర్తిగా అర్థరహితమని మండిపడ్డారు. తెలంగాణ రైతులపై బీజేపీ చూపిస్తున్నదంతా కపట ప్రేమేనంటూ ధ్వజమెత్తారు.

రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేయడం లేదని విమర్శలు కురిపించిన కిషన్ రెడ్డి… మళ్లీ అదే నోటితో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి, 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంపై ఎక్స్టెన్షన్ కావాలని కోరడాన్ని ఎంపీ వంశీకృష్ణ తప్పుపట్టారు. తెలంగాణ రైతుల ధాన్యాన్ని కేంద్రం ఎందుకు కొనుగోలు చేయడం లేదని కాంగ్రెస్ నాయకులు ఎన్నోమార్లు ప్రశ్నించినా… కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రామగుండం ఆర్‌ఎఫ్‌సీఎల్ (RFCL) పరిశ్రమపై కూడా ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వర్గీయ కాకా వెంకటస్వామి  పదివేల కోట్ల రుణమాఫీ చేయించి ఆర్‌ఎఫ్‌సీఎల్ సంస్థను పునరుద్ధరిస్తే… నేటి బీజేపీ ప్రభుత్వం తన చేతగాని తనంతో ఆ సంస్థను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి కారణంగానే తెలంగాణ రైతులకు భారీ నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక అయోధ్య రామమందిరం అంశాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు ఎంపీ వంశీకృష్ణ. ఎన్నికల్లో రాముడి పేరు చెప్పి ఓట్లు దొంగిలించిన బీజేపీ… ఇప్పుడు అదే రామమందిరం నిర్మాణం పేరుతో ఏకంగా 250 కోట్ల రూపాయల స్కామ్‌కు పాల్పడిందంటూ సంచలన ఆరోపణలు చేశారు.

©️ VIL Media Pvt Ltd.