July 8, 2026

El Nino: భారత్‌కు హైఅలెర్ట్.. పసిఫిక్ మహాసముద్రంలో అలజడి!

El Nino: భారత్‌కు హైఅలెర్ట్.. పసిఫిక్ మహాసముద్రంలో అలజడి!
Reading Time: 2 minutes
El Nino Impact On India Pacific Ocean Warming Explained

Explainer: వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మహాసముద్రం వేడెక్కుతోంది. ఆ వేడి కనిపించదు. పొగ కనిపించదు. కానీ దాని ప్రభావం కోట్లాది మంది జీవితాలపై పడబోతోంది. రైతు పొలంలో పంట ఎండిపోవచ్చు. జలాశయాలు ఖాళీ కావచ్చు. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడొచ్చు. ఇండియా వ్యాప్తంగా తీవ్రమైన వేడి అలలు విరుచుకుపడొచ్చు.

ఇప్పుడు ప్రపంచ శాస్త్రవేత్తలను భయపెడుతున్న విషయం ఇదే. పసిఫిక్ మహాసముద్రంలో అసాధారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భారత్ భవిష్యత్తుకు పెద్ద హెచ్చరికగా మారుతున్నాయి. అందుకే ఇప్పుడు అందరి చూపు పసిఫిక్ మహాసముద్రంలోని నినో త్రీ పాయింట్ ఫోర్ ప్రాంతం మీదే ఉంది.

NOAA లెక్కలు ఏం చెబుతున్నాయ్?

అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే NOAA విడుదల చేసిన తాజా గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి జూలై నాలుగు వరకు ప్రతి రోజూ నినో త్రీ పాయింట్ ఫోర్ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి.

జూన్ ఒకటో తేదీన గత ఏడాదితో పోలిస్తే ఉష్ణోగ్రత తేడా పాయింట్ సున్నా ఆరు డిగ్రీల సెల్సియస్ ఉండగా జూలై నాలుగో తేదీకి అది పాయింట్ 64 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. అంటే కేవలం ఒక నెలలోనే ఈ తేడా దాదాపు 55శాతం పెరిగింది. సముద్రం ఎంత వేగంగా వేడెక్కుతోందో ఈ గణాంకాలే చెబుతున్నాయి. ఈ ఏడాది జూన్ ఒకటో తేదీన నినో త్రీ పాయింట్ ఫోర్ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 28.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. జూలై నాలుగో తేదీకి అది 29.23డిగ్రీల సెల్సియస్‌కు పెరిగింది. జూన్ 19న అత్యధికంగా 29.41 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపించింది. జూన్ ఒకటో తేదీన 27.44 డిగ్రీల సెల్సియస్ ఉన్న ఉష్ణోగ్రత జూలై నాలుగో తేదీకి 27.59 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గిపోయింది. అంటే గత ఏడాది చల్లబడిన సముద్రం ఈ ఏడాది మాత్రం నిరంతరం వేడెక్కుతూనే ఉంది.

ఇక పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు భూమధ్యరేఖ ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు చాలా నెలల పాటు సాధారణం కంటే ఎక్కువగా ఉండే పరిస్థితిని ఎల్‌నినో అంటారు. ఈ వేడి కారణంగా వాతావరణంలో గాలి ప్రసరణ మారుతుంది. భారత్‌కు వర్షాలను తీసుకొచ్చే రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. అందుకే ఎల్‌నినో బలపడితే ఇండియాలో వర్షాలు తగ్గే ప్రమాదం పెరుగుతుంది.

అయితే వర్షాలను ఎల్‌నినో ఒక్కటే నిర్ణయించదు. భారత మహాసముద్ర డైపోల్ వంటి ఇతర వాతావరణ వ్యవస్థలు కూడా ప్రభావం చూపుతాయి. అయినప్పటికీ నినో త్రీ పాయింట్ ఫోర్ ప్రాంతంలో కనిపించే వేడి ప్రపంచ వాతావరణ సంస్థ, NOAA శాస్త్రవేత్తలకు అత్యంత కీలక సూచికగా ఉంటుంది. ఇక వేడెక్కిన సముద్రం వాతావరణంలోకి మరింత వేడి, తేమను విడుదల చేస్తుంది. దాని ప్రభావం వేల కిలోమీటర్ల దూరంలోని దేశాలపై కూడా పడుతుంది. భారత్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. దేశానికి ఏడాదిలో పడే మొత్తం వర్షపాతంలో దాదాపు 70శాతం నైరుతి రుతుపవనాల ద్వారానే వస్తుంది.

ఈ వర్షాలపైనే వ్యవసాయం, జలాశయాలు, తాగునీటి నిల్వలు ఆధారపడి ఉంటాయి. ఇప్పటికే భారత వాతావరణ శాఖ జూలై నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతేకాదు 125 సంవత్సరాల వర్షపాత చరిత్రలో ఈ ఏడాది జూన్ ఐదో అత్యంత పొడి జూన్‌గా నమోదైంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వర్షాభావాన్ని ఎదుర్కొనే ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ప్రధాని మోడీ సంబంధిత శాఖలను ఆదేశించారు.

అయితే ఇప్పుడు ప్రపంచ శాస్త్రవేత్తల ఆందోళన మాత్రం నినో త్రీ పాయింట్ ఫోర్ ప్రాంతం చుట్టూనే ఉంది. ఈ వేడి మరికొన్ని నెలలు కొనసాగితే ఎల్‌నినో మరింత బలపడే అవకాశం ఉంది. అలా జరిగితే భారత్‌లో వర్షాభావం, తీవ్ర ఉష్ణోగ్రతలు, నీటి కొరత, పంటల నష్టం లాంటి సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.