ఈ నెలలో కలుద్దాం! తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర సర్కార్ నుంచి సీఎంవోకు సమాచారం

- రాష్ట్ర ప్రతిపాదనకు బదులు ఇచ్చిన మహారాష్ట్ర సర్కారు
హైదరాబాద్, వెలుగు: ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టులో అత్యంత కీలకమైన తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు విషయంలో మహారాష్ట్రతో చర్చల దిశగా కీలక అడుగు పడింది. సీఎం రేవంత్రెడ్డి రాసిన లేఖకు స్పందనగా ఈ నెలలో చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర సీఎంఓకు గురువారం సమాచారం అందింది.
ప్రాజెక్టుతో ముడిపడి ఉన్న అంతర్రాష్ట్ర అంశాలు, ముంపు సమస్యలపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకునేందుకు వీలుగా తెలంగాణ సర్కార్ కొన్ని ప్రతిపాదనలు మహారాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచిన సంగతి తెలిసిందే. కాగా, ఈ నెలలోనే సమావేశం జరగనుండగా, తేదీలపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, సమావేశంలో ప్రధానంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సాంకేతిక, భౌగోళిక అంశాలపై కీలక చర్చలు జరపనున్నట్టు అధికారులు చెప్తున్నారు.
ప్రధానంగా తుమ్మడి హెట్టి బ్యారేజీని150 మీటర్లతో నిర్మించేందుకు అనుమతించాలని మహారాష్ట్రను తెలంగాణ కోరనుంది. ఈ విషయంలో మహారాష్ట్ర అభ్యంతరాలను విని, పరిష్కారానికి ప్రత్యామ్నాయాలను ఆ సర్కారు ముందు పెట్టనుంది.
150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించినా మహారాష్ట్ర వైపు ఉన్న గిరిజన, అటవీ భూములు ముంపునకు గురయ్యే అవకాశం తక్కువేనని, ఒకవేళ ముంపునకు గురైతే పూర్తిస్థాయిలో భూసేకరణ, ముంపు నష్టపరిహార వ్యయాన్ని పూర్తిగా తామే భరిస్తామని హామీ ఇవ్వనున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక యాక్షన్ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే రెండు నెలల కిందే మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది.