Garuda Puranam: ఈ 5 రకాల వ్యక్తులతో స్నేహం చేస్తే జీవితమే నరకం.. గరుడ పురాణం హెచ్చరిక కూడా ఇదే!

Garuda Puranam: మనిషి జీవితాన్ని మార్చేది అదృష్టం లేదా కష్టపడే తత్వం మాత్రమే కాదని, అతను ఎలాంటి వ్యక్తులతో కలిసి ఉంటాడన్నది కూడా అంతే ముఖ్యమని శాస్త్రాలు చెబుతాయి. ముఖ్యంగా సనాతన ధర్మంలోని 18 మహాపురాణాల్లో ఒకటైన గరుడ పురాణం ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వివరిస్తుంది. చాలామంది గరుడ పురాణాన్ని కర్మలు, యమలోకం, పాపపుణ్యాల గురించి చెప్పే గ్రంథంగా మాత్రమే భావిస్తారు. కానీ ఇందులో విజయవంతమైన, ప్రశాంతమైన జీవితం కోసం పాటించాల్సిన అనేక నీతి సూత్రాలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది మన సావాసం. ఎవరితో తిరుగుతున్నాం, ఎవరిని నమ్ముతున్నాం, ఎవరికి ఎక్కువ సమయం ఇస్తున్నాం అనే విషయాలు మన భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని గరుడ పురాణం సూచిస్తోంది.
గరుడ పురాణం ప్రకారం ఎప్పుడూ నెగిటివ్ గా ఆలోచిస్తూ, తమ జీవితంలో జరిగే ప్రతి సమస్యకు ఇతరులనే కారణమని నిందించే వ్యక్తులకు దూరంగా ఉండాలి. అలాంటి వారి మాటలు, ఆలోచనలు క్రమంగా మనపై కూడా ప్రభావం చూపుతాయి. వారి నెగెటివ్ ఆలోచనలు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, ఏ పని చేయాలన్నా వెనుకడుగు వేయించే ప్రమాదం ఉంటుంది.
ధర్మాన్ని, మర్యాదను, సామాజిక విలువలను గౌరవించని వారితో స్నేహం కూడా మంచిది కాదని ఈ పురాణం చెబుతోంది. నైతిక విలువలను ఎగతాళి చేసే వ్యక్తులు క్రమంగా తమ చుట్టూ ఉన్నవారిని కూడా అదే దారిలో నడిపించే అవకాశం ఉంటుంది. మంచి చెడుల మధ్య తేడా తెలియకుండా చేసే అలాంటి సావాసం చివరకు జీవితాన్నే తప్పుదోవ పట్టించవచ్చని హెచ్చరిస్తుంది.
స్వార్థం కోసం మాత్రమే సంబంధాలను కొనసాగించే వ్యక్తుల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని గరుడ పురాణం వివరిస్తుంది. అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరై, పని పూర్తయిన తర్వాత దూరమయ్యే వ్యక్తులు నిజమైన స్నేహితులు కాదని పేర్కొంటుంది. అలాంటి వారిపై అతిగా నమ్మకం పెడితే నిరాశ, మోసం ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని సూచిస్తుంది.
చిన్న విషయానికే కోపం తెచ్చుకునే వారు, అహంకారంతో ప్రవర్తించే వారితో కూడా ఎక్కువగా కలవొద్దని గరుడ పురాణం చెబుతోంది. అలాంటి వ్యక్తుల ప్రవర్తన వల్ల కుటుంబ సంబంధాలు, స్నేహాలు, పని చేసే చోటులో వాతావరణం దెబ్బతినే అవకాశం ఉంటుంది. వారి ఆవేశం, అహంకారం చుట్టుపక్కల వారిపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఈ గ్రంథం పేర్కొంటుంది.
ఇతరుల గురించి ఎప్పుడూ చాడీలు చెప్పేవారు, వెనుక నుంచి విమర్శించేవారితో స్నేహం చేయడం కూడా ప్రమాదకరమని గరుడ పురాణం హెచ్చరిస్తుంది. ఈరోజు మీ ముందు మరొకరి గురించి చెడుగా మాట్లాడే వ్యక్తి, రేపు మీ గురించి కూడా అదే విధంగా మాట్లాడే అవకాశముందని ఇందులో సూచించబడింది. అలాంటి వారితో సంబంధాలు కొనసాగించడం అనవసర సమస్యలకు దారితీస్తుందని పేర్కొంటుంది.
అలాగే అతిగా పొగిడే వారిపట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని గరుడ పురాణం సలహా ఇస్తుంది. నిజమైన స్నేహితుడు తప్పును తప్పే అని చెప్పాలి. కానీ ఎప్పుడూ పొగుడుతూ, ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉండేవారు చాలాసార్లు తమ ప్రయోజనం కోసం మాత్రమే అలా చేస్తుంటారు. వారి ప్రభావంతో తీసుకునే తప్పుడు నిర్ణయాలు జీవితంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
గరుడ పురాణం చెప్పే ఈ సూచనలు కేవలం ఆధ్యాత్మిక విశ్వాసాలకు మాత్రమే పరిమితం కావు. మంచి సాంగత్యం వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుందని, చెడు సాంగత్యం జీవితాన్ని కష్టాల్లోకి నెట్టేస్తుందని చెప్పే శాశ్వత జీవన సూత్రాలుగా కూడా వీటిని చూడవచ్చు. పాజిటివ్ ఆలోచనలు కలిగినవారితో, నిజాయితీగా ప్రవర్తించే వారితో, మన మంచి కోరుకునే వారితో స్నేహం చేస్తే జీవితం ప్రశాంతంగా, విజయవంతంగా సాగుతుందని గరుడ పురాణం ఒక బలమైన సందేశం ఇస్తోంది.