గాంధీ భవన్ లో ఘనంగా వైఎస్ జయంతి..పాల్గొన్న మంత్రులు వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు: వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచనతోనే తమ ప్రభుత్వం ముందుకు పోతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం గాంధీ భవన్ లో వైఎస్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి మంత్రులు వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ కేవీపీ రాంచందర్ రావు, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఇతర నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ…ఉచిత కరెంట్ అమలు సాధ్యం అని నిరూపించిన నాయకుడు వైఎస్ అని కొనియాడారు. ప్రతి రైతు, ప్రతి పేదవాడు, ప్రతి ఇంటిలో ఒకరు వైఎస్ ను గుర్తు చేసుకునేలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశాడని చెప్పారు. ఆయన పాలన స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు.