Yamaha Aerox-e: భారత మార్కెట్లో యమహా ఏరోక్స్-ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే

Yamaha Aerox-e: జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా భారత మార్కెట్లో తన కొత్త ఏరోక్స్-ఇ (Aerox-e) ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది. ఆకర్షణీయమైన స్పోర్టీ డిజైన్, శక్తివంతమైన పనితీరు, ఆధునిక ఫీచర్లతో ఈ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. పెట్రోల్ ఆధారిత ఏరోక్స్ 155 మోడల్‌ను పోలిన డిజైన్‌తో వచ్చిన ఈ స్కూటర్, భారతదేశంలో యమహా విడుదల చేసిన రెండో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కావడం విశేషం.
ధర ఎంత?
యమహా ఏరోక్స్-ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 2.82 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ప్రస్తుతం ఇది కంపెనీ భారత మార్కెట్లో విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలిచింది.
బ్యాటరీ, రేంజ్
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 1.5 kWh రిమూవబుల్ (తీసివేయగల) బ్యాటరీను అందించారు. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 117 కిలోమీటర్ల IDC రేంజ్ అందిస్తుందని యమహా తెలిపింది. బ్యాటరీలో అధిక సామర్థ్యం గల సెల్స్‌ను ఉపయోగించడం వల్ల మెరుగైన పనితీరు లభిస్తుందని కంపెనీ పేర్కొంది. ఏరోక్స్-ఇలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 12.9 హెచ్‌పీ గరిష్ట శక్తితో పాటు 48 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. నగర రహదారులతో పాటు హైవేపై కూడా మెరుగైన రైడింగ్ అనుభవాన్ని అందించేలా దీన్ని రూపొందించారు.
రైడింగ్ మోడ్‌లు
ఈ స్కూటర్‌లో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఎకో (Eco), స్టాండర్డ్ (Standard), పవర్ (Power). అదనంగా బూస్ట్ మోడ్ కూడా అందుబాటులో ఉంది. వేగంగా ఓవర్‌టేక్ చేయాల్సిన సందర్భాల్లో ఈ మోడ్ అదనపు శక్తిని అందిస్తుంది.
ఆధునిక ఫీచర్లు
యమహా ఏరోక్స్-ఇలో పలు ప్రీమియం ఫీచర్లను అందించింది.
ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో ABS
రియర్ డిస్క్ బ్రేక్
ట్విన్ LED హెడ్‌ల్యాంప్స్
LED టెయిల్ ల్యాంప్
TFT డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
యాప్ ఆధారిత స్మార్ట్ కనెక్టివిటీ
ఎక్కడ లభిస్తుంది?
ప్రస్తుతం ఈ స్కూటర్ ఢిల్లీ, ముంబై, చెన్నై, పూణే నగరాల్లో అందుబాటులో ఉంది. త్వరలోనే దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా విక్రయాలు ప్రారంభించాలని యమహా యోచిస్తోంది.