July 10, 2026

రైలు ప్రయాణికులకు అలర్ట్..! వాట్సాప్, స్క్రీన్‌షాట్ టిక్కెట్లు చెల్లవు.. భారతీయ రైల్వే కొత్త రూల్స్ ఇవే!

రైలు ప్రయాణికులకు అలర్ట్..! వాట్సాప్, స్క్రీన్‌షాట్ టిక్కెట్లు చెల్లవు.. భారతీయ రైల్వే కొత్త రూల్స్ ఇవే!
Reading Time: 2 minutes
రైలు ప్రయాణికులకు అలర్ట్..! వాట్సాప్, స్క్రీన్‌షాట్ టిక్కెట్లు చెల్లవు.. భారతీయ రైల్వే కొత్త రూల్స్ ఇవే!

మీరు తరచూ రైళ్లలో ప్రయాణిస్తుంటారా? టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఫోన్లలో స్క్రీన్‌షాట్లు తీసి లేదా వాట్సాప్‌లో వచ్చిన పిడిఎఫ్ (PDF) ఫైళ్లను చూపిస్తూ జర్నీ చేస్తున్నారా? అయితే ఇకపై మీరు మీ అలవాటును మార్చుకోవాల్సిందే! రైల్ వన్ (Rail One) యాప్ ద్వారా బుక్ చేసుకునే రిజర్వేషన్ లేని టిక్కెట్లకు సంబంధించి భారతీయ రైల్వే కీలకమైన కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ ద్వారా ప్రయాణికులను అప్రమత్తం చేసింది. కొత్త రూల్స్ ప్రకారం.. ప్రయాణ సమయంలో యాప్‌లోని అసలైన డిజిటల్ టిక్కెట్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

కొత్త నిబంధనల ప్రకారం ఏ టిక్కెట్లు చెల్లవు?

టికెట్ తనిఖీ చేసే సమయంలో చాలామంది ప్రయాణికులు నెట్‌వర్క్ సమస్యల కారణంగానో లేదా సులువుగా ఉంటుందనో టికెట్ స్క్రీన్‌షాట్లను చూపిస్తుంటారు. అయితే ఇకపై అలాంటి వాటిని రైల్వే అధికారులు అంగీకరించరు. ప్రధానంగా కింద పేర్కొన్న డిజిటల్ కాపీలను చూపిస్తే ప్రయాణికులను వితౌట్ టికెట్‌గా పరిగణిస్తారు:

* టికెట్ పిడిఎఫ్ (PDF) కాపీ

* టికెట్ తీసిన ఫొటో లేదా స్క్రీన్‌షాట్

* వాట్సాప్‌లో షేర్ చేసిన లేదా ఫార్వార్డ్ చేసిన టికెట్

* మరేదైనా మెసేజింగ్ యాప్ ద్వారా పంపిన టికెట్ కాపీ

రైల్వేల కొత్త నిబంధనలు ఏమిటి?

రైలు ప్రయాణంలో ఎలాంటి సమస్యలు లేదా జరిమానాలు పడకుండా ఉండాలంటే టికెట్ తనిఖీ సిబ్బంది (TTE) అడిగినప్పుడు ఈ క్రింది విధానాలను ఖచ్చితంగా పాటించాలి:

  1. టికెట్ తనిఖీ సమయంలో, రైల్ వన్ యాప్‌లో ఉన్న అసలైన (Original) టికెట్‌ను మాత్రమే ఓపెన్ చేసి చూపించాలి.
  2. మీరు ఏ మొబైల్ ద్వారా అయితే టికెట్ బుక్ చేసుకున్నారో, అదే మొబైల్‌లోని రైల్ వన్ యాప్‌లో టికెట్ చూపించాల్సి ఉంటుంది.
  3. బుకింగ్ చేసిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయిన యాప్‌లోనే ఆ టికెట్ అందుబాటులో ఉండాలి. వేరే నంబర్ ఉన్న ఫోన్లకు మార్చకూడదు.
  4. డిజిటల్ టికెట్‌తో పాటు ప్రయాణికుడు తన వెంట తప్పనిసరిగా ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు పొందిన ఒరిజినల్ ఫోటో ఐడీ కార్డును (ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ మొదలైనవి) కలిగి ఉండాలి.

నిబంధనలను మార్చడానికి కారణం ఏంటి?

టిక్కెట్ల స్క్రీన్‌షాట్‌లు, వాట్సాప్ ఫార్వార్డ్‌లు, పిడిఎఫ్ కాపీల ద్వారా భారీగా మోసాలు జరుగుతున్నట్లు రైల్వే శాఖ గుర్తించింది. ఒకే టికెట్ స్క్రీన్‌షాట్‌ను, పిడిఎఫ్‌ను ఒకరి కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉపయోగించి రైల్వే ఆదాయానికి గండి కొడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ విధమైన మోసాలకు అడ్డుకట్ట వేయడానికి, పారదర్శకతను పెంచడానికి రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.

ఇకపై ఎవరైనా ప్రయాణికుడు అసలైన యాప్ టికెట్ కాకుండా స్క్రీన్‌షాట్ లేదా ఫొటోలు చూపిస్తే, వారిని టికెట్ లేని ప్రయాణికుడిగా పరిగణించి రైల్వే చట్టాల ప్రకారం భారీ జరిమానా విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కాబట్టి ప్రయాణికులు రైలు ఎక్కే ముందే ఈ కొత్త నిబంధనలను గుర్తుంచుకోవాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..