July 9, 2026

Video: పుష్ప సీన్‌ను మించి.. నదిలో వేల గ్యాస్ సిలిండర్లు.. ఎలా వచ్చాయో వీడియోలో చూడండి..

Video: పుష్ప సీన్‌ను మించి.. నదిలో వేల గ్యాస్ సిలిండర్లు.. ఎలా వచ్చాయో వీడియోలో చూడండి..
Reading Time: < 1 minute
Video: పుష్ప సీన్‌ను మించి.. నదిలో వేల గ్యాస్ సిలిండర్లు.. ఎలా వచ్చాయో వీడియోలో చూడండి..

వర్షాకాలంలో భారీ వర్షాలకు నదులు పొంగితే చేపలు కొట్టుకొచ్చిన దృశ్యాలు చూసుంటారు. కానీ సిలిండర్లు కొట్టుకొచ్చిన దృశ్యాలు ఎప్పుడైనా చూశారా ?. మహారాష్ట్ర లో ఇదే జరిగింది. రాయగఢ్ జిల్లాలో భారీ వర్షాలు వరద ఉధృతికి ఊహించని భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పాన్వెల్ తాలూకా చావణే గ్రామంలోని ఎంఐడీసీ పరిధిలో ఉన్న HPCL (హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) ఎల్‌పిజి బాట్లింగ్ ప్లాంట్ పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. దీంతో ప్లాంట్‌లో నిల్వ ఉంచిన దాదాపు 3000 గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయాయి. ఇందులో కొన్ని నింపి ఉంచిన సిలిండర్లు కొన్ని ఖాళీ సిలిండర్లు ఉన్నాయి. ఈ సిలిండర్లన్నీ సమీపంలోని పాతాళగంగ నదిలోకి కొట్టుకుపోయాయి. దీంతో స్థానికులు దొరికిన సిలిండర్లను దొరికినట్లు తీసుకువెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సిలిండర్లు పేలే అవకాశం

నదిలో సిలిండర్లు కొట్టుకుపోతున్న విషయంపై రాయగఢ్ జిల్లా కలెక్టర్ కిషన్ జావళే అత్యవసర భద్రతా హెచ్చరికలు జారీ చేశారు. నదీతీర ప్రాంతాల ప్రజలు కొట్టుకువచ్చిన సిలిండర్లను చూసి, ఉచితంగా దొరికాయన్న ఆశతో వాటిని తాకడం ఇళ్లకు తీసుకెళ్లడం వంటి పనులు చేయవద్దని కలెక్టర్ హెచ్చరించారు. నదిలోని రాళ్లకు ఢీకొట్టడం వల్ల ఆ సిలిండర్ల పరిస్థితి ప్రమాదకరంగా మారవచ్చని, ఒకవేళ వాటి రెగ్యులేటర్లు దెబ్బతిని ఉంటే అవి ఎప్పుడైనా పేలిపోయే ముప్పు ఉందని స్పష్టం చేశారు. గ్రామాల్లో లేదా నది ఒడ్డున ఎక్కడైనా సిలిండర్లు కనిపిస్తే వెంటనే స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి, పోలీసులకు లేదా సమీపంలోని HPCL గ్యాస్ డీలర్లకు సమాచారం అందించాలని కోరారు. మరోవైపు కొందరు స్థానికులు ప్రమాదాన్ని లెక్కచేయకుండా నది ఒడ్డుకు కొట్టుకువచ్చిన సిలిండర్లను సేకరించేందుకు ప్రయత్నించడం అధికారులను ఆందోళనకు గురిచేసింది. రంగంలోకి దిగిన HPCL కంపెనీ సిబ్బంది, స్థానిక విపత్తు నిర్వహణ బృందాలు సంయుక్తంగా భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. నదిలో కొట్టుకుపోయిన 3,000 సిలిండర్లలో ఇప్పటివరకు దాదాపు 1,000 సిలిండర్లను అధికారులు సురక్షితంగా వెలికితీశారు. మిగిలిన సిలిండర్లను గుర్తించి, స్వాధీనం చేసుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

వీడియో చూడండి..