July 10, 2026

Bhatti Vikramarka : బీఆర్‌ఎస్ మాయమాటలు నమ్మొద్దు..

Bhatti Vikramarka : బీఆర్‌ఎస్ మాయమాటలు నమ్మొద్దు..
Reading Time: < 1 minute
Bhatti Vikramarka Rythu Bharosa Brs Comments

తెలంగాణలోని రైతులకు పెట్టుబడి సాయం అందించే క్రమంలో ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రైతు భరోసా పథకం కింద నూతనంగా రూ. 1,009 కోట్ల నిధులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయగా, ఆ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. గత ప్రభుత్వం రైతు బంధు నిధుల కోసం 169 రోజులు తిప్పించుకునేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 9 రోజుల్లోనే రూ. 9 వేల కోట్లు ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొనియాడారు. ఇప్పటివరకు 74 లక్షల మంది రైతులకు, 1.45 కోట్ల ఎకరాల భూములకు గానూ మొత్తం రూ. 8,759 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించామన్నారు. అలాగే మహిళా సంక్షేమానికి కట్టుబడి కేవలం రెండున్నర ఏళ్లలోనే మహిళలకు రూ. 67,000 కోట్ల రుణాలను అందించామని, పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తూ రైతును రాజుగా చూస్తున్నామని భట్టి స్పష్టం చేశారు.

మరోవైపు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దశాబ్దాల క్రితం కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఒక్కటి కూడా దెబ్బతినలేదని, కానీ బీఆర్‌ఎస్ నాయకులు రూ. 27,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్టును రూ. 1,47,000 కోట్లకు పెంచి, కట్టక కట్టక కట్టిన కాళేశ్వరాన్ని కూల్చేశారని మండిపడ్డారు. హరీష్ రావు అబద్ధాలన్నీ ప్రోగేసి మాట్లాడుతున్నారని, బీఆర్‌ఎస్ చేసిన అప్పులు, వడ్డీలు కడుతూనే తాము ఉద్యోగుల బిల్లులు క్లియర్ చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ప్రజలను మోసం చేసిన బీఆర్‌ఎస్ నాయకుల భవిష్యత్తు అయిపోయిందని, వారు మళ్లీ మాయమాటలతో ఊళ్లలోకి వస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని, తరిమి తరిమి కొడతారని భట్టి విక్రమార్క హెచ్చరించారు.