July 11, 2026

పత్తి రైతు పరేషాన్.. వర్షాలు లేవు.. విత్తనాలు భూమిలోనే మాడిపోతున్నాయి..

పత్తి రైతు పరేషాన్.. వర్షాలు లేవు.. విత్తనాలు భూమిలోనే మాడిపోతున్నాయి..
Reading Time: 2 minutes

పత్తి రైతు పరేషాన్.. వర్షాలు లేవు.. విత్తనాలు భూమిలోనే మాడిపోతున్నాయి..

Caption of Image.
  • అక్కడక్కడ మొలక వచ్చినా ఎండకు మాడిపోతున్నయ్ 
  • రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు
  • తీవ్రంగా నష్టపోతున్న రైతులు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా పత్తి విత్తనాలు వేసిన రైతులు పరేషాన్​లో పడిపోయారు. జులై రెండో వారం వచ్చినా ఆశించిన స్థాయిలో వానలు పడకపోవడంతో విత్తనాలు మొలకెత్తడం లేదు. కొద్దిగా తేమ ఉన్న ప్రాంతాల్లో మొలకలు వచ్చినా.. ఎండ వేడికి అవి వాడిపోతున్నాయి. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, కూలీలపై భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులు వానల కోసం మొగులు దిక్కు చూస్తున్నారు. విస్తారంగా వర్షాలు కురిస్తేనే మొలకలు నిలబడుతాయని, లేదంటే భారీ మొత్తంలో నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇప్పటికే 40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు

ఈ వానాకాలం సీజన్​లో రాష్ట్ర వ్యాప్తంగా 1.32 కోట్ల ఎకరాల్లో వివిధ పంటల సాగు జరుగుతుందని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా 45 నుంచి 55 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని అంచనా వేయగా.. ఇప్పటికే సుమారు 40 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. నాలుగు లక్షల ఎకరాల్లో వరి, 3.19 లక్షల ఎకరాల్లో  కంది,  2.84 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 3.34 లక్షల ఎకరాల్లో సోయా సాగు చేశారు. 

మొలకలు రాక రైతుల్లో బుగులు

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులు జూన్‌‌ నెలలోనే దుక్కులు సిద్ధం చేసి పత్తి సాగుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ట్రాక్టర్లతో భూములు దున్నించి విత్తనాలు వేశారు. కానీ భారీ వర్షాలు కురవకపోవడంతో విత్తనాలు మొలకెత్తడం లేదు. కొన్ని చోట్ల అచ్చుసాళ్లు మూసుకుపోవడంతో మొలక శాతం తగ్గింది. కొన్నిచోట్ల కొద్దో గొప్పో మొలకలు వచ్చినప్పటికీ… ఎండ తీవ్రతకు అవి కూడా వాడిపోతున్నాయి. దీంతో కొందరు డ్రిప్ తో, మరికొందరు బోర్ల నీటితో మొక్కలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో 15 రోజుల కింద పత్తి వేయగా మొలకలు రాలేదు. నిర్మల్​జిల్లా నర్సాపూర్ మండలంలోని గొల్లమాడ, తిమ్మాపూర్, బురుపల్లి తండా, అంజనితండా, కుస్లి గ్రామాల్లో మొలకలు ఎండిపోతున్నాయి. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో  పత్తి వేసిన రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. మొలకలు రాకపోయినా, మొలక శాతం తగ్గినా మళ్లీ విత్తనాలు వేయాల్సి వస్తుంది. 

దీంతో ఇప్పటికే భారీగా పెట్టుబడి పెట్టిన రైతులపై అదనపు భారం పడనుంది. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే.. పరిస్థితి మరింత దారుణంగా మారనుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ ప్రారంభం నుంచి జులై మొదటి వారం వరకు పత్తి విత్తనాలు విత్తేందుకు అనుకూల సమయమని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విత్తనాలు ఆలస్యంగా నాటడంతో పంట దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

బోర్ల నీటితో మొలకలు కాపాడుకునే ప్రయత్నం

కొన్ని చోట్ల మొలకలను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బోర్లు, బావుల్లో మిగిలిన నీటితో తడులు కడుతున్నారు. కొందరు డ్రిప్‌‌ ద్వారా నీరు అందిస్తుండగా, మరికొందరు బకెట్లు, బిందెలతో నీళ్లు పోస్తున్నారు. చాలాచోట్ల భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో సాగుకు ఇబ్బందులు తప్పడం లేదు. ‘ రెండు ఎకరాల్లో పత్తి వేశాను. 

ఎకరానికి మూడు ప్యాకెట్ల విత్తనాలు కొనుగోలు చేశాను. రెండు వారాలుగా వానలు లేకపోవడంతో గింజలు సరిగా మొలకెత్తడం లేదు. బోరు నీటితో తడుపుతున్నా ఎంతకాలం కాపాడగలమో తెలియడం లేదు. మంచి వర్షం పడితేనే పంట నిలుస్తుంది’. అని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

లోటు వర్షపాతంతో రైతుల్లో ఆందోళన

రాష్ట్రంలో ఇప్పటికీ సాధారణం కంటే దాదాపు 15 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. చాలా జిల్లాల్లో 20 నుంచి 57 శాతం వరకు లోటు ఉంది. వర్షాభావ పరిస్థితులతో చెరువులు నిండకపోవడం, భూగర్భ జలాలు పెరగకపోవడంతో రైతుల ఆందోళన మరింత  పెరుగుతోంది. ఈ ఏడాది పత్తి సాగు ఖర్చులు గణనీయంగా పెరిగాయి. సాధారణంగా ఎకరాకు రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది.

 వర్షాలు అనుకూలిస్తే ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు ఆశించారు. కానీ ప్రస్తుత వాతావరణ పరిస్థితులను చూస్తే దిగుబడి బాగా తగ్గే ప్రమాదం ఉందని ఆఫీసర్లు చెప్తున్నారు. వానలు పడకపోతే ఈ సారి నిండా మునిగిపోతామని రైతులు వాపోతున్నారు. 

సగం విత్తనాలు మాడిపోయాయి 

నేను 14 బ్యాగుల పత్తి విత్తనాలు తీసుకొచ్చి 10 ఎకరాల్లో సాగు చేపట్టాను. వర్షాలు సరిగా పడకపోవడంతో మొదటి సారి వేసిన విత్తనాలు సగం మాడిపోయాయి. రెండో సారి ఆరు బ్యాగులు తీసుకొచ్చి మళ్లీ వేశా. ఇప్పుడు కూడా వర్షాలు పడడం లేదు. ఈ సారి కూడా విత్తనాలు మొలకెత్తకపోతే తీవ్రంగా నష్టపోతాం.

– పాముల మల్లయ్య, దేగామ, బజార్ హత్నూర్-

ఇప్పటికే రూ. లక్ష ఖర్చు పెట్టా 

నేను పది ఎకరాల్లో పత్తి సాగు చేపట్టాను. పెట్టుబడి కోసం ఇప్పటికే రూ. లక్ష ఖర్చు అయింది. వర్షాలు లేక మొలకలు వాడిపోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్రంగా నష్టపోతాం.

 – రాసం ప్రవీణ్ కుమార్-

©️ VIL Media Pvt Ltd.