అయ్యో..ఎంత పనాయేరా.. దోస్త్ గానీ వాట్సాప్ స్టేటస్ చూసి దొంగతనం.. కట్ చేస్తే

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో తమను తాము గొప్పగా, ధనవంతులుగా చూపించుకోవడం చాలా మందికి అలవాటుగా మారింది. కానీ, మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఒక వ్యక్తి చేసిన ఫేక్ వీడియో చివరకు అతని ప్రాణాల మీదకు తెచ్చింది. తను ధనవంతుడినని స్నేహితుల ముందు ఫోజు కొట్టేందుకు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను వాడుకుని చేసిన ఒక తప్పు.. అతని ఇంట్లోనే నిజమైన దోపిడీకి దారితీసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ దోపిడీకి ప్లాన్ చేసింది మరెవరో కాదు, అతని ప్రాణ స్నేహితుడే!
AI వీడియో తెచ్చిన తంటా:
నాగపూర్‌కు చెందిన బాధితుడు తన స్నేహితుల మధ్య కాస్త హుందాగా, ధనవంతుడిగా చలామణి అవ్వాలని ఆశపడ్డాడు. ఇందుకోసం అతను AI టూల్స్ ఉపయోగించి ఒక ఫేక్ వీడియోను క్రియేట్ చేశాడు. ఆ వీడియోలో అతని ఇల్లంతా నోట్ల కట్టలు ఉన్నట్లు, అతని చిన్న కూతురు ఆ నోట్ల కట్టల మధ్య ఆడుకుంటున్నట్లు ఎడిట్ చేశాడు. ఆ వీడియోను తన వాట్సాప్ స్టేటస్ లో పెట్టాడు.
నిజమని నమ్మిన స్నేహితుడు – దోపిడీ ప్లాన్:
సాంకేతికతపై పెద్దగా అవగాహన లేని బాధితుడి స్నేహితుడు ఆ వీడియోను చూసి షాక్ అయ్యాడు. తన స్నేహితుడి వద్ద బ్లాక్ మనీ కోట్లలో మూలుగుతోందని నిజంగానే నమ్మాడు. డబ్బుపై ఆశతో అతని బుద్ధి గడ్డికరిచింది. వెంటనే కొంతమంది అనుచరులతో కలిసి స్నేహితుడి ఇంట్లోనే దోపిడీకి ప్లాన్ చేశాడు. అనుకున్నట్లే బాధితుడి ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు.
రూ.40 లక్షల డిమాండ్ – పోలీసుల ఎంట్రీ:
ఇంట్లో దొంగతనం చేసిన తర్వాత కూడా నిందితుల ఆశ తీరలేదు. బాధితుడి వద్ద ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు దాగి ఉందని భావించి, అతడిని ప్రాణాలతో చంపేస్తామని బెదిరించడం ప్రారంభించారు. నోరు మూసుకుని రూ.40 లక్షలు ఇస్తేనే వదిలేస్తామని డిమాండ్ చేశారు. నిందితుల నుండి వస్తున్న వరుస బెదిరింపులతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితుడు చివరకు నాగపూర్‌లోని బెల్తరోడి పోలీసులను ఆశ్రయించి తన ఆవేదనను చెప్పుకున్నాడు.

ఇద్దరు నిందితుల అరెస్ట్:
బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. విచారణ జరిపి ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ విచిత్ర కేసు గురించి బెల్తరోడి పోలీస్ ఇన్‌స్పెక్టర్ సచిన్ అహేర్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో నకిలీ హోదాను ప్రదర్శించడం వల్లే ఈ నేరం జరిగింది అని తెలిపారు. వర్చువల్ ప్రపంచంలో చేసే నకిలీ ప్రదర్శనలు నిజ జీవితంలో ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ.