ప్రైవేట్ వర్సిటీలపై విచారణకు హైలెవల్ కమిటీ.. నిబంధనల అమలు తీరుపై నిగ్గుతేల్చాలని సర్కార్ ఆదేశం

- నిబంధనల అమలు తీరుపై నిగ్గుతేల్చాలని సర్కార్ ఆదేశం
- ప్రతి వర్సిటీని విజిట్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ
- సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తనిఖీల ప్రక్రియ స్పీడప్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ యూనివర్సిటీల నిబంధనల ఉల్లంఘనలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రైవేట్ వర్సిటీల పనితీరుపై సమగ్ర విచారణ జరిపేందుకు విద్యాశాఖ ఒక హైలెవల్ ఎక్స్‌పర్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రైవేట్ వర్సిటీలు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటిదాకా పాటిస్తున్న నిబంధనలు, విద్యా ప్రమాణాలపై క్షుణ్ణంగా పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలని కమిటీకి విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా ప్రైవేట్ యూనివర్సిటీల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలపై దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇటీవల తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ప్రైవేట్ వర్సిటీల మౌలిక సదుపాయాలు, విద్యార్థుల భద్రతతో కూడిన 9 కీలక అంశాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశించిన ఆ 9 అంశాలపై లోతుగా స్టడీ చేసి.. వాస్తవాలను కోర్టు ముందుంచే బాధ్యతను మన రాష్ట్ర ప్రభుత్వం హైలెవల్ ఎక్స్‌పర్ట్ కమిటీకి అప్పగించింది.
క్షేత్రస్థాయి విజిట్ తప్పనిసరి
ఈ హైలెవల్ ఎక్స్‌పర్ట్ కమిటీ కేవలం కాగితాల పరిశీలనకే పరిమితం కాకుండా.. రాష్ట్రంలోని ప్రతి ప్రైవేట్ యూనివర్సిటీని స్వయంగా క్షేత్రస్థాయిలో సందర్శించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించనుంది. వర్సిటీల ఏర్పాటుకు చట్ట ప్రకారం అవసరమైన భూమి, భవనాలు, ల్యాబ్‌లు, ఇతర మౌలిక సదుపాయాలు నిజంగా ఉన్నాయా లేదా అనే కోణంలో అధికారులు తనిఖీలు చేస్తారు. దాంతో పాటు విద్యార్థులకు అందిస్తున్న అకడమిక్ ప్రమాణాలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన ఫ్యాకల్టీ నియామకాలు జరిగాయా? వర్సిటీల రోజువారీ ఆర్థిక, పరిపాలన నిర్వహణలో పారదర్శకత ఉందా లేదా? అనే విషయాలను కమిటీ సభ్యులు నిగ్గుతేల్చనున్నారు. ఈ తనిఖీల ద్వారా నిబంధనలు ఉల్లంఘించి కేవలం వ్యాపార ధోరణితో నడుపుతున్న ప్రైవేట్ విద్యాసంస్థల అసలు రంగు బయటపడే అవకాశం ఉంది.
వీలైనంత త్వరగా నివేదిక
ప్రైవేట్ వర్సిటీల పనితీరుపై సుప్రీంకోర్టు తదుపరి విచారణ ఈ నెల 24వ తేదీన ఉంది. ఈ నేపథ్యంలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తనిఖీలు పూర్తి చేసి వీలైనంత త్వరగా నివేదికను సమర్పిస్తే.. దాని ఆధారంగానే ప్రభుత్వం సుప్రీంకోర్టులో పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయనుంది. ఈ ఉన్నత స్థాయి కమిటీకి కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ చైర్మన్‌గా వ్యవహరించనుండగా.. ఉన్నత విద్యామండలి కార్యదర్శి మెంబర్ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వీరితో పాటు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్, పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్, ఉస్మానియా యూనివర్సిటీ ఫైనాన్స్ ఆఫీసర్, సాంకేతిక విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు కమిటీలో కీలక సభ్యులుగా ఉండి విచారణ జరపనున్నారు.