July 8, 2026

రోజంతా మొబైల్, ల్యాప్‌టాప్‌తోనేనా?.. ఈ ప్రమాదకర సిండ్రోమ్ బారిన పడే ఛాన్స్ ఉందట!

రోజంతా మొబైల్, ల్యాప్‌టాప్‌తోనేనా?.. ఈ ప్రమాదకర సిండ్రోమ్ బారిన పడే ఛాన్స్ ఉందట!
Reading Time: 2 minutes

పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన చేతుల్లో ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ఉండాల్సిందే. ఆఫీస్ పని అయినా, టైమ్‌పాస్ అయినా అంతా డిజిటల్ మయమైపోయింది. అయితే, దీనివల్ల మీ చేతులు, మణికట్టు తీవ్ర ప్రమాదంలో పడుతున్నాయని మీకు తెలుసా? ఒకప్పుడు వయసు పైబడిన వారిలో మాత్రమే కనిపించే ‘కార్పల్ టన్నెల్ సిండ్రోమ్’ అనే నరాల సమస్య, ఇప్పుడు యువతను ఐటీ ఉద్యోగులను కంటెంట్ క్రియేటర్లను వేధిస్తోంది. మీ చేతి వేళ్లలో తిమ్మిర్లు వస్తున్నాయా? ఆ వివరాలు చూద్దాం..

మణికట్టులో అసలు ఏం జరుగుతుంది?: మన మణికట్టు భాగంలో ‘కార్పల్ టన్నెల్’ అనే ఒక సన్నని మార్గం ఉంటుంది. దీని గుండానే చేతి వేళ్లకు బలాన్ని, స్పర్శను ఇచ్చే ‘మీడియన్ నర్వ్’ అనే ముఖ్యమైన నరం వెళ్తుంది. మనం రోజంతా ఫోన్ స్క్రోల్ చేయడం గంటల తరబడి కీబోర్డ్‌పై టైప్ చేయడం లేదా గేమింగ్ ఆడటం వల్ల ఈ నరంపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది అని నిపుణులు తెలుపుతున్నారు.

చేతి వేళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?: ఈ సమస్య వస్తే చేతి వేళ్లలో తిమ్మిర్లు రావడం, సూదులతో పొడిచినట్లు మొద్దుబారడం, మణికట్టులో విపరీతమైన నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా రాత్రి పూట ఈ నొప్పులు మరింత ఎక్కువవుతాయి. ఇక చేతిలో పట్టు తగ్గిపోయి వస్తువులు కింద పడిపోతుంటాయి. మొదట్లో ఇవి చిన్న చిన్న నొప్పుల్లాగే అనిపించినా నిర్లక్ష్యం చేస్తే చేతి కండరాలు బలహీనపడి, నరాలు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందని డాక్టర్ కృష్ణ హెచ్చరిస్తున్నారు.

Using Mobile and Laptop All Day? You Could Be at Risk of This Syndrome
Using Mobile and Laptop All Day? You Could Be at Risk of This Syndrome

ముప్పు ఎవరికి ఎక్కువగా ఉందంటే: రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చునే వారితో పాటు ఊబకాయం మధుమేహం, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి ఈ ముప్పు చాలా ఎక్కువ. అలాగే, కూర్చునే విధానం సరిగ్గా లేకపోయినా, చేతులకు సౌకర్యంగా లేని కీబోర్డ్ మౌస్ వాడుతున్నా ఈ నరాల నొప్పులు త్వరగా వస్తాయి. ఇక శారీరక శ్రమ అస్సలు లేకపోవడం కూడా దీనికి మరో ప్రధాన కారణం.

ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా?: మనం తీసుకునే కొన్ని చిన్న జాగ్రత్తలతో ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు. ల్యాప్‌టాప్‌పై పనిచేసేటప్పుడు ప్రతి 45 నుండి 60 నిమిషాలకు ఒకసారి చిన్న బ్రేక్ తీసుకుని చేతులకు విశ్రాంతి ఇవ్వాలి. టైపింగ్ చేసేటప్పుడు మణికట్టు వంగకుండా తిన్నగా, సహజ స్థితిలో ఉండేలా చూసుకోవాలి. ఇక ఎర్గోనామిక్ కీబోర్డ్, మౌస్ వాడటం చాలా మంచిది. వీలైతే ఫోన్ వాడకాన్ని తగ్గించి, మధ్యమధ్యలో మణికట్టును ఫ్రీగా స్ట్రెచింగ్ చేసే వ్యాయామాలు చేయాలి.

సాంకేతికత మన జీవితాన్ని సులువు చేసినా, మన నిర్లక్ష్యం వల్ల అది ఆరోగ్యానికి శాపంగా మారకూడదు. డిజిటల్ పరికరాలను వాడుతూనే, మధ్యమధ్యలో చేతులకు విరామం ఇవ్వడం అలవాటు చేసుకోండి. మీ మణికట్టు ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.

గమనిక: చేతి వేళ్లలో తిమ్మిర్లు, నొప్పులు ఎక్కువగా ఉంటే సొంత వైద్యం చేసుకోకుండా, వెంటనే నరాల లేదా ఎముకల నిపుణుడిని సంప్రదించి సరైన సలహా పొందడం ఉత్తమం.

The post రోజంతా మొబైల్, ల్యాప్‌టాప్‌తోనేనా?.. ఈ ప్రమాదకర సిండ్రోమ్ బారిన పడే ఛాన్స్ ఉందట! appeared first on Manalokam – Latest Telugu News & Updates.