Reading Time: 2 minutes
Jagga Reddy On Telangana Elections Wont Contest From Sangareddy Open To Another Constituency

కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయనని స్పష్టం చేసిన ఆయన.. అయితే వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయనని ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది పూర్తిగా పార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. అలాగే కాంగ్రెస్ 117 స్థానాల్లో విజయం సాధించాలని సీఎం లక్ష్యంగా పెట్టుకోవడం మంచి ఆలోచన అని అన్నారు. ఎన్నికలకు రెండేళ్ల ముందే పార్టీని సిద్ధం చేయడం రాజకీయ నాయకుడిగా సీఎం తీసుకున్న సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు.

ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలనేది వ్యక్తిగత నిర్ణయం కాదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికను పార్టీ, ఇన్‌చార్జి, ఏఐసీసీ కలిసి నిర్ణయిస్తాయని చెప్పారు. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత సీఎంపై ఉంటుందని, అందుకు అనుగుణంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి స్పందించడం సహజమని జగ్గారెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధుల పనితీరును సమీక్షించే హక్కు సీఎంకు ఉంటుందని చెప్పారు. సీఎం ఇచ్చే సూచనలను ఎమ్మెల్యేలు స్వీకరించి తమ పనితీరును మెరుగుపర్చుకుంటే వారికి రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని సూచించారు. అలాగే పనితీరు మార్చుకోని ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వాలా లేదా అనే విషయాన్ని కూడా పార్టీ నాయకత్వం పరిశీలించే అవకాశం ఉంటుందని అన్నారు.

మరోవైపు ప్రతిపక్ష పార్టీలు చేసే సర్వేలపై కూడా జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నిర్వహించే సర్వేల్లో ఆ పార్టీకి అనుకూల ఫలితాలే వస్తాయని, అలాగే బీజేపీ కూడా తమకు అనుకూలంగా అధికారంలోకి వస్తామని చెప్పే సర్వేలను ప్రచారం చేస్తుందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షం ఎప్పుడూ అధికార పార్టీని బలహీనపరిచే ప్రయత్నమే చేస్తుందని, అదే రాజకీయ స్వభావమని అన్నారు.

ప్రస్తుత ఎమ్మెల్యేలకు జగ్గారెడ్డి కీలక సూచనలు చేశారు. “మేం తోపులం” అనే భావనలో ఉంటే అది పొరపాటేనన్నారు. గతంలో ఎంతో బలమైన నాయకులుగా భావించిన వారే ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు బలంగా కనిపించినా, ఎన్నికల సమయంలో బి-ఫారం ఇచ్చే అధికారం సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ నాయకత్వం చేతుల్లోనే ఉంటుందని చెప్పారు. వారు అంగీకరించకపోతే టికెట్ దక్కదని స్పష్టం చేశారు.

సంగారెడ్డి నియోజకవర్గంలో నిర్మల పోటీ చేస్తారని జగ్గారెడ్డి తెలిపారు. అయితే తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పడం లేదని, కేవలం సంగారెడ్డి నుంచి మాత్రమే పోటీ చేయనని స్పష్టం చేశారు. వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలా.? వద్దా.? అనేది పూర్తిగా పార్టీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. జగ్గారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో వచ్చే ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై కొత్త చర్చకు దారితీశాయి. ముఖ్యంగా సంగారెడ్డి కాకుండా మరో నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.