భగ్గుమన్న క్రూడాయిల్ ధర.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. రూ.9 లక్షల కోట్లు ఆవిరి

4 శాతం పెరిగి 77 డాలర్లకు చేరిక
సెన్సెక్స్ 1,600 పాయింట్లు డౌన్
24,000 కిందికి చేరిన నిఫ్టీ
పశ్చిమాసియాలో
మళ్లీ ఉద్రిక్తతల ప్రభావం
ముంబై: పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన ఘర్షణల కారణంగా బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలు, ముడి చమురు ధరల పెరుగుదల కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ రెండు శాతం వరకు పడిపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 24 వేల మార్కు దిగువకు చేరింది.
ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1677.12 పాయింట్ల నష్టంతో 76503.60 వద్ద ముగిసింది. నిఫ్టీ 516.65 పాయింట్లు (2.12 శాతం) నష్టపోయి 23882.05 వద్ద స్థిరపడింది. పెట్టుబడిదారుల సంపదగా భావించే కంపెనీల మార్కెట్క్యాప్రూ.8.96 లక్షల కోట్లు తగ్గి రూ.4,71,23,612.10 కోట్లకు పడిపోయింది. ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, చమురు గ్యాస్, ప్రైవేట్ బ్యాంకులు హెల్త్‌కేర్ లాంటి కీలక రంగాల షేర్లలో భారీగా అమ్మకాలు జరిగాయి. కేవలం రియల్టీ రంగం మాత్రమే పాజిటివ్ జోన్ లో ట్రేడయింది.
ఇండిగో షేర్ 5 శాతం డౌన్
సెన్సెక్స్నుంచి ఇండిగో ఏకంగా 5.02 శాతం పడిపోయి అత్యధిక నష్టాన్ని నమోదు చేసింది. మారుతి సుజుకి 4.11 శాతం, హిందుస్థాన్ యూనీలివర్ 3.32 శాతం, బజాజ్ ఫైనాన్స్ 3.08 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 2.93 శాతం, ఎమ్ అండ్ ఎమ్ 2.85 శాతం, ఐటీసీ 2.82 శాతం, బీఈఎల్ 2.70 శాతం, రిలయన్స్ 2.35 శాతం నష్టపోయాయి. ట్రెంట్ మాత్రం 0.17 శాతం నష్టంతో ముగిసింది. ఇన్ఫోసిస్ 0.21 శాతం, టైటాన్ 0.34 శాతం, సన్ ఫార్మా 0.75 శాతం, టాటా స్టీల్ 0.87 శాతం పడ్డాయి. తాజా దాడుల వల్ల అంతర్జాతీయంగా చమురు సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతాయనే భయాలు ఇన్వెస్టర్లలో పెరిగాయి.
5.35 శాతం నష్టపోయిన కొరియా మార్కెట్
ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి సూచీ ఏకంగా 5.35 శాతం కుప్పకూలింది. జపాన్ నిక్కీ– 225 సూచీ 2.11 శాతం నష్టపోగా, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ సూచీ 0.49 శాతం క్షీణించింది. హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్ మాత్రం 2.99 శాతం లాభపడింది. యూరప్ మార్కెట్లు సైతం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు కూడా మంగళవారం నష్టాలతోనే ముగిశాయి.
4.25 శాతం పెరిగిన చమురు ధర
తాజా ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 4.25 శాతం పెరిగి బ్యారెల్‌కు 77.31 డాలర్లకు చేరింది. డబ్ల్యుటీఐ క్రూడ్ ఆయిల్ కూడా 4.22 శాతం పెరిగి 73.41 డాలర్లకు చేరుకుంది. భారతదేశం తన చమురు అవసరాల కోసం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతుంది కాబట్టి చమురు ధరల పెరుగుదల మన ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందిగా మారుతుంది. ద్రవ్యోల్బణం వల్ల కంపెనీల లాభాల మార్జిన్లు తగ్గుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఇండియన్ ఆయిల్ 3.5 శాతం, హెచ్‌పీ షేరు 5.5 శాతం, బీపీసీఎల్ షేరు 4.7 శాతం పడింది. మార్కెట్ భయాలను ప్రతిబింబించే ఇండియా వీఐఎక్స్ సూచీ 25.62 శాతం పెరిగి 14.58 స్థాయికి చేరింది.
52 పైసలు పడ్డ రూపాయి
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 52 పైసలు క్షీణించి రూ.95.48 వద్ద ముగిసింది. తాజా ఘర్షణలు డాలర్ బలోపేతానికి దారితీయడంతో రూపాయిపై ఒత్తిడి పెరిగింది. ఇరాన్ తన ఎదురుదాడులలో భాగంగా బహ్రెయిన్, కువైట్ దేశాలను లక్ష్యంగా చేసుకుంది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అధిక చమురు ధరలతో పాటు బలహీనమైన దేశీయ మార్కెట్లు రూపాయి విలువపై ఒత్తిడిని మరింత పెంచాయి. ఘర్షణలు ముదిరితే రూపాయి మరింత బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.