July 8, 2026

షుగర్ లెవల్స్ పెరగకుండా స్వీట్లు తినే సరైన సమయం

షుగర్ లెవల్స్ పెరగకుండా స్వీట్లు తినే సరైన సమయం
Reading Time: 2 minutes

ఈరోజుల్లో పండుగైనా పెళ్లైనా ఏదైనా చిన్న సంతోషమైనా మనకు ముందుగా గుర్తొచ్చేది స్వీట్లు. నోరు తీపి చేసుకోకుండా మనకు ఏ వేడుక పూర్తి కాదు. అయితే, ఈ మిఠాయిలను కేవలం ఎంత తింటున్నామనేదే కాదు.. ఏ సమయంలో తింటున్నామనేది కూడా మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. తప్పుడు సమయంలో తీపి పదార్థాలు తినడం వల్ల బరువు పెరగడం, షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా మారిపోవడం వంటి సమస్యలు వస్తాయి. మరి స్వీట్లు తినడానికి సరైన సమయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఖాళీ కడుపుతో అస్సలు వద్దు: చాలా మందికి ఉదయం నిద్రలేవగానే టీ, కాఫీలతో పాటు బిస్కెట్లు, స్వీట్లు తినే అలవాటు ఉంటుంది. కానీ ఖాళీ కడుపుతో తీపి తింటే, ఆ చక్కెర చాలా వేగంగా రక్తంలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరిగిపోతాయి. ఇక ఆ వెంటనే అంతే వేగంగా పడిపోతాయి కూడా! ఫలితంగా ఉదయాన్నే విపరీతమైన నీరసం, అలసట రావడమే కాకుండా.. రోజంతా పదేపదే స్వీట్లు తినాలనే కోరిక కలుగుతుంది.

Best Time to Eat Sweets Without Spiking Blood Sugar
Best Time to Eat Sweets Without Spiking Blood Sugar

భోజనం తర్వాత తింటేనే బెటర్: మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం తర్వాత కొద్దిగా స్వీట్ తినడం మంచి పద్ధతి. ఎందుకంటే మనం తినే అన్నం, పప్పు, కూరల్లో ఫైబర్, ప్రోటీన్లు ఉంటాయి. ఇక ఇవి మనం తిన్న స్వీట్‌లోని చక్కెరను శరీరం నెమ్మదిగా శోషించుకునేలా చేస్తాయి. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ ఒకేసారి పెరిగిపోకుండా స్థిరంగా ఉంటాయి. కాబట్టి భోజనం ముగిశాక చాలా తక్కువ పరిమాణంలో తీపిని రుచి చూడవచ్చు.

రాత్రిపూట తింటే డేంజర్: రాత్రి పడుకునే ముందు చాక్లెట్లు, కేకులు లేదా స్వీట్లు అస్సలు తినకూడదు. రాత్రి పూట మన శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్తుంది కాబట్టి మనం తిన్న చక్కెరను శక్తిగా మార్చలేదు. ఫలితంగా ఆ అదనపు క్యాలరీలన్నీ కొవ్వుగా మారి చాలా వేగంగా బరువు పెరుగుతారు. ఇక ఇది భవిష్యత్తులో తీవ్రమైన డయాబెటిస్ సమస్యలకు దారితీస్తుంది. స్వీట్లు తినాలనుకుంటే పగటిపూట తినడమే మంచిది, ఎందుకంటే ఆ సమయంలో శారీరక కదలికల వల్ల క్యాలరీలు సులభంగా కరుగుతాయి.

భోజనానికి బదులుగా స్వీట్లా?: ఈ రోజుల్లో బిజీ లైఫ్ వల్ల చాలా మంది ఆకలి వేసినప్పుడు అన్నం తినకుండా కేకులు, పేస్ట్రీలు లేదా కూల్ డ్రింక్స్‌తో కడుపు నింపేస్తుంటారు. ఇక ఇవి తాత్కాలికంగా ఆకలిని చంపేస్తాయి కానీ, శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు వంటి ఏ రకమైన పోషకాలను అందించవు. కాబట్టి ఆకలి వేసినప్పుడు పప్పులు ఆకుకూరలు తాజా పండ్లు ఉన్న సమతుల్య ఆహారానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.

ఇక తీపి పదార్థాలు తినడం తప్పు కాదు, కానీ వాటిని తినే సమయం, తినే పరిమాణంపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. పగటిపూట, అదీ భోజనం తర్వాత తక్కువ మొత్తంలో స్వీట్లు తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

గమనిక: ఇప్పటికే మధుమేహం, ఊబకాయం, థైరాయిడ్ వంటి హార్మోన్ల సమస్యలు ఉన్నవారు తీపి పదార్థాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. వీరు తప్పనిసరిగా తమ డాక్టర్ లేదా డైటీషియన్ సలహా మేరకే స్వీట్లను పరిమితంగా తీసుకోవాలి.

The post షుగర్ లెవల్స్ పెరగకుండా స్వీట్లు తినే సరైన సమయం appeared first on Manalokam – Latest Telugu News & Updates.