మహిళా సంఘాల నిధులు గోల్ మాల్ ! రూ. కోటి వరకు కమ్యూనిటీ యానిమేటర్ చేతివాటం ?

- చేర్యాల మండలం దానంపల్లిలో వెలుగుచూసిన ఐకేపీ నిధుల దారిమళ్లింపు వ్యవహారం
- గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు, సీఏకు షోకాజ్ నోటీసులు జారీ
సిద్దిపేట/చేర్యాల, వెలుగ: సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలం దానంపల్లి గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు చెందిన దాదాపు రూ. కోటి మేర నిధులు పక్కదారి పట్టిన ఉదంతం కలకలం రేపుతోంది.
గ్రామంలోని 26 సంఘాల్లో 25 సంఘాల సభ్యుల అమాయకత్వాన్ని, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని కమ్యూనిటీ యానిమేటర్ (సీఏ) నకిలీ సంతకాలతో తప్పుడు తీర్మానాలు చేస్తూ, బ్యాంకుల నుంచి రుణాలను పొంది సొంతానికి వాడుకున్నట్లు వెలుగులోకి వచ్చింది.
సభ్యులు ఐదారేండ్లుగా నెలవారీ కిస్తీలు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నప్పటికీ, సీఏ ఆ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాల్లో జమ చేయకపోవడంతో రూ. కోటి వరకు నిధుల గోల్ మాల్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బాధితులు చేర్యాల ఎస్బీఐ వద్ద ఆందోళన చేపట్టగా, పూర్తిస్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని స్థానిక మహిళలు డిమాండ్ చేస్తున్నారు.
షోకాజ్ నోటీసులు జారీ..
ఈ వ్యవహారంపై అధికారులు చేపట్టిన విచారణలో ఇప్పటివరకు 7 సంఘాలకు సంబంధించి రూ. 60 లక్షలకు పైగా నిధులు దారిమళ్లినట్లు నిర్ధారణ కావడంతో, గ్రామైక్య సంఘం అధ్యక్షురాలితో పాటు సీఏకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మిగతా సంఘాలకు సంబంధించి కూడా విచారణ చేపడుతున్నారు.
కాగా, అధికారుల పాత్ర లేకుండా బ్యాంకు రుణాల సొమ్ము పక్కదారి పట్టడం సాధ్యం కాదనే అనుమానాలు కూడా వ్యక్తమవుతుండటంతో ఐకేపీ, బ్యాంకర్లు, సంబంధిత అధికారులు సంయుక్తంగా లోతుగా విచారణ జరిపితే మరిన్ని నిజాలు బయటపడతాయని సభ్యులు ఆశిస్తున్నారు. ఏపీఎం, సీసీ, ఆడిటర్లతో కూడిన బృందం మిగిలిన ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోందని, త్వరలోనే సమగ్ర విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకుంటామని ఏపీఎం ఆంజనేయులు తెలిపారు.