July 9, 2026

US-Iran: ఇరాన్‌లో బాంబుల మోత.. చైనా-రష్యా రైల్వే కారిడార్‌పై అమెరికా దాడి…

US-Iran: ఇరాన్‌లో బాంబుల మోత.. చైనా-రష్యా రైల్వే కారిడార్‌పై అమెరికా దాడి…
Reading Time: < 1 minute
Us Strikes Iran China Russia Railway Bridge

US-Iran: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం తీవ్రమైంది. అమెరికా ఇరాన్ వ్యాప్తంగా బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ మిలిటరీ స్థావరాలను నాశనం చేస్తోంది. వరసగా రెండో రోజు కూడా యూఎస్ తన దాడుల్ని కొనసాగించింది. ఇరాన్‌లో వ్యూహాత్మకంగా కీలకంగా ఉన్న చైనా-తుర్క్‌మెనిస్తాన్-ఇరాన్ రైల్ కారిడార్‌ యూఎస్ టార్గెట్ చేసింది. గోలెస్తాన్ ప్రావిన్స్‌లోని కారిడార్‌లోని కీలకమైన ఒగ్టే ఖాన్ వంతెనను అమెరికా క్షిపణులతో కూల్చివేసింది.

ఈ రైల్ ప్రాజెక్ట్ చైనా, తుర్క్‌మెనిస్తాన్, ఇరాన్‌లను కలుపుతుంది. దాడి తర్వాత టెహ్రాన్, మషద్ వంటి నగరాల్లో రైలు సేవలు నిలిపివేసినట్లు తెలుస్తోంది. చిక్కుకుపోయిన ప్రయాణికుల్ని రోడ్డుమార్గంలో గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది. తాజాగా దాడికి గురైన చైనా రైల్ కారిడార్‌ను 2025 చివర నుంచి సరుకుల రవాణా కోసం రష్యా కూడా ఉపయోగించుకుంటోంది. ఈ నేపథ్యంలో అమెరికా జరిపిన ఈ దాడి ప్రాధాన్యత సంతరించుకుంది.

హార్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛకు ముప్పు కలిగించే టెహ్రాన్ సామర్థ్యాన్ని మరింత బలహీనపరిచేందుకు అమెరికా దళాలు ఇరాన్‌పై అదనపు దాడులు చేశాయని అమెరికా సైనిక కేంద్ర కమాండ్ తెలిపింది. బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం ముగిసిందని ప్రకటించి యుద్ధానికి తెర తీశారు. వారితో మాట్లాడి ప్రయోజనం లేదని, ఇరాన్ నాయకులు తమను మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు.