పాతికేళ్ల క్రితం తీసుకున్న రూ. 25 వేల అప్పు తీర్చేందుకు..గూగుల్ సాయంతో వెతికి.. కేరళ నుంచి ధర్మపురికి వచ్చిన స్నేహితుడు

డబ్బు కోసం నమ్మినవాళ్లనే మోసం చేసే ఈ రోజుల్లో.. స్నేహానికి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఒక అద్భుతమైన ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి పాతికేళ్ల క్రితం తీసుకున్న అప్పును తిరిగి ఇచ్చేందుకు ఏకంగా వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి వచ్చారు.
కేరళ రాష్ట్రం పాలక్కాడ్‌కు చెందిన మహ్మద్ ఇస్మాయిల్, 25 ఏళ్ల క్రితం సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు.. ధర్మపురికి చెందిన ఎడ్ల లచ్చన్న అనే వ్యక్తితో కలిసి పనిచేశారు. ఆ సమయంలో లచ్చన్న వద్ద ఇస్మాయిల్ కొంత డబ్బు అప్పుగా తీసుకున్నారు. కాలక్రమేణా ఇద్దరూ ఊర్లకు వచ్చేయడం.. ఒకరికొకరు టచ్‌లో లేకపోవడంతో లచ్చన్న పూర్తి చిరునామా కానీ, ఫోన్ నంబర్ కానీ ఇస్మాయిల్ దగ్గర లేవు.
కానీ, తన స్నేహితుడికి ఇవ్వాల్సిన అప్పును ఎలాగైనా తీర్చి, రుణభారం దింపుకోవాలని ఇస్మాయిల్ బలంగా నిశ్చయించుకున్నారు. కేవలం ‘ధర్మపురి’ అనే ఊరు పేరు గుర్తున్న ఇస్మాయిల్.. గూగుల్ మ్యాప్స్ సహాయంతో కేరళ నుంచి దాదాపు 1000 కిలోమీటర్లు ప్రయాణించి జగిత్యాల జిల్లా ధర్మపురికి చేరుకున్నారు. అక్కడ స్థానికులను అడుగుతూ, ఎంతో శ్రమించి చివరకు లచ్చన్న ఇంటిని కనుగొన్నారు.
ALSO READ : సౌదీలో జగిత్యాల యువకుడి గోట్ లైఫ్.. మోసం చేసి ఎడారిలో వదిలేసిన ఏజెంట్..
ప్రస్తుతం లచ్చన్న మళ్లీ గల్ఫ్‌లో ఉండటంతో.. ఇస్మాయిల్ ఆయనతో ఫోన్‌లో మాట్లాడి, ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం తాను ఇవ్వాల్సిన ₹25 వేల నగదును లచ్చన్న కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇన్నేళ్ల తర్వాత కూడా తనను వెతుక్కుంటూ వచ్చి, రూపాయి కూడా అటు ఇటు కాకుండా అప్పు తీర్చిన పాత మిత్రుడి నిజాయితీని లచ్చన్న ఫోన్‌లోనే అభినందించారు. ఈ హృదయపూర్వక ఘటన స్థానికంగా అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా.. సమాజంలో ఇంకా మానవత్వం బతికే ఉందనే నమ్మకాన్ని ఇస్తోంది.