జిమ్‌కు వెళ్లలేకపోతున్నారా? టై దొరకట్లేదా..? ఐతే ఇంట్లోనే ఈ పని చేయండి..

ప్రస్తుత కాలంలో బిజీ జీవనశైలి కారణంగా చాలామందికి జిమ్‌కు వెళ్లడం లేదా ప్రత్యేకంగా వ్యాయామం చేయడానికి సమయం దొరకడం లేదు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే గంటల తరబడి వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. రోజువారీ జీవితంలో చేసే చిన్నపాటి శారీరక కార్యకలాపాలు కూడా శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి సులభమైన, ప్రభావవంతమైన వ్యాయామాల్లో మెట్లు ఎక్కడం ఒకటి. ఎలాంటి ప్రత్యేక పరికరాలు లేకుండా ఎక్కడైనా చేయగలిగే ఈ వ్యాయామం శరీరాన్ని చురుకుగా ఉంచడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గుండె ఆరోగ్యానికి మేలు
మెట్లు ఎక్కడం ఒక మంచి కార్డియో వ్యాయామంగా పనిచేస్తుంది. ఇది గుండె వేగాన్ని పెంచి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా మెట్లు ఎక్కడం వల్ల గుండె పనితీరు మెరుగై గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది. మెట్లు ఎక్కే సమయంలో తొడలు, మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలు, తుంటి భాగం, పిరుదుల కండరాలు ఎక్కువగా పనిచేస్తాయి. దీంతో కండరాల బలం, ఓర్పు పెరిగి శరీర సమతుల్యత కూడా మెరుగుపడుతుంది.
కేలరీలు వేగంగా ఖర్చవుతాయి
సాధారణంగా నడకతో పోలిస్తే మెట్లు ఎక్కడం ద్వారా ఎక్కువ శక్తి వినియోగించబడుతుంది. దీంతో అధిక కేలరీలు ఖర్చై బరువు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి వ్యాయామంగా భావిస్తారు. రోజూ మెట్లు ఎక్కడం వల్ల గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడి శరీరానికి ఎక్కువ స్టామినా వస్తుంది. దీనివల్ల రోజువారీ పనులను అలసట లేకుండా చేయగలుగుతారు.
ఎముకల ఆరోగ్యం
మెట్లు ఎక్కడం బరువు మోసే వ్యాయామం (Weight-Bearing Exercise) కాబట్టి ఎముకల సాంద్రతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలంలో ఎముకల బలాన్ని పెంచడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. మోకాళ్ల నొప్పులు, కీళ్లవాతం, గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు, తరచూ తల తిరిగే సమస్య ఉన్నవారు లేదా ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నవారు వైద్యుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే మెట్లు ఎక్కే వ్యాయామం చేయాలి. వృద్ధులు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
మెట్లు ఎక్కేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు
వ్యాయామాన్ని మొదట నెమ్మదిగా ప్రారంభించి క్రమంగా వేగాన్ని పెంచాలి. జారిపోని మంచి పట్టు ఉన్న బూట్లు ధరించడం మంచిది. అవసరమైతే మెట్ల రెయిలింగ్‌ను పట్టుకుని ఎక్కాలి. వ్యాయామం చేస్తున్న సమయంలో ఛాతీ నొప్పి, తీవ్రమైన ఆయాసం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆపి వైద్యుడిని సంప్రదించాలి. సరైన విధంగా, క్రమం తప్పకుండా మెట్లు ఎక్కడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు శరీర ఫిట్‌నెస్, కండరాల బలం, బరువు నియంత్రణ వంటి అనేక ప్రయోజనాలను పొందవచ్చు.