July 9, 2026

మైక్రోసాఫ్ట్ బిగ్ డెసిషన్.. 20% ఉద్యోగులు ఔట్!

మైక్రోసాఫ్ట్ బిగ్ డెసిషన్.. 20% ఉద్యోగులు ఔట్!
Reading Time: 2 minutes

టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ (ఉద్యోగుల తొలగింపులు) కలకలం రేపుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు చెందిన గేమింగ్ విభాగం ‘ఎక్స్‌బాక్స్’ (Xbox) తన చరిత్రలోనే అతిపెద్ద షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఖర్చులను తగ్గించుకుంటూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వైపు పెట్టుబడులు పెంచేందుకు వీలుగా ఏకంగా 20 శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు రెడీ అయింది. ఉద్యోగాలు కోల్పోతున్న ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? అసలు ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఒకేసారి 3,200 మంది ఉద్యోగులు ఔట్: ఎక్స్‌బాక్స్ సంస్థ తన మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 3,200 మందిని దశలవారీగా తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా మొదటి విడత కింద 1,600 మందిని వెంటనే విధుల్లోంచి తీసేసింది. ఇక మిగిలిన ఉద్యోగుల కోతను 2027 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పూర్తి చేయనుంది. కంపెనీని లాభాల బాట పట్టించేందుకు మైక్రోసాఫ్ట్ చేస్తున్న ఖర్చుల నియంత్రణలో భాగంగానే ఈ భారీ లేఆఫ్స్ చోటుచేసుకుంటున్నాయి.

Microsoft's Big Decision: Xbox Cuts 20% of Its Workforce
Microsoft’s Big Decision: Xbox Cuts 20% of Its Workforce

ఎందుకీ కఠిన నిర్ణయం?: సంస్థ ప్రస్తుత పరిస్థితిపై ఎక్స్‌బాక్స్ సీఈఓ ఆశా శర్మ ఉద్యోగులకు ఒక లేఖ రాశారు. ప్రస్తుతం తమ వ్యాపారం అనుకున్నంత ఆశాజనకంగా లేదని ఆమె స్పష్టం చేశారు. ఇక ఇతర గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లతో పోలిస్తే తమ లాభాలు 3 నుండి 10 రెట్లు తక్కువగా ఉన్నాయని తెలిపారు. గతంలో చేసిన కొన్ని పెట్టుబడులు సరిగ్గా వర్కౌట్ కాకపోవడం, మార్కెట్లో విపరీతమైన పోటీ పెరగడం, హార్డ్‌వేర్ ఖర్చులు ఎక్కువైపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.

మేనేజ్‌మెంట్‌లో భారీ మార్పులు: కంపెనీలో నిర్ణయాలు వేగంగా జరగడానికి వీలుగా మేనేజ్‌మెంట్ వ్యవస్థను పూర్తిగా మార్చేస్తున్నారు. ఇప్పటివరకు సంస్థలో 14 స్థాయిల మేనేజ్‌మెంట్ ఉండటం వల్ల ఏ చిన్న నిర్ణయానికైనా ఆలస్యమయ్యేది. ఇక అందుకే ఇకపై ఆ పొరలను గరిష్టంగా 5 స్థాయిలకే పరిమితం చేయనున్నారు. దీనితో పాటు బయటి విక్రేతలపై పెట్టే ఖర్చులను కూడా 50 శాతం వరకు తగ్గించాలని ఎక్స్‌బాక్స్ నిర్ణయించింది.

కొత్తగా చేరిన సీఓఓ (COO): ఎక్స్‌బాక్స్ బిజినెస్‌ను మరింత సమర్థవంతంగా నడిపించేందుకు హెలెన్ చియాంగ్‌ను కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియమించారు. ఇకపై కంటెంట్ హార్డ్‌వేర్ సర్వీసుల బాధ్యతను ఆమె చూసుకుంటారు. అలాగే పాపులర్ గేమ్స్ అయిన మోజాంగ్, కింగ్ వంటి స్టూడియోలు ఇకపై నేరుగా సీఈఓ పరిధిలోకి వస్తాయి. ఇక అయితే ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్న మెయిన్ గేమ్ ప్రాజెక్టులను రద్దు చేసే ఉద్దేశం లేదని కంపెనీ స్పష్టం చేసింది.

ఇక ఉద్యోగుల తొలగింపు ఎప్పుడూ బాధాకరమైన విషయమే అయినా సంస్థను భవిష్యత్తు కోసం మరింత దృఢంగా మార్చేందుకే ఈ మార్పులు చేస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. ఇకపై మరింత క్రమశిక్షణతో, క్లియర్ స్ట్రాటజీతో గేమింగ్ మార్కెట్లో దూసుకుపోతామని ఎక్స్‌బాక్స్ నమ్మకంగా ఉంది.

గమనిక: ఉద్యోగాల తొలగింపు అనేది ఉద్యోగుల ప్రతిభ తక్కువగా ఉందని కాదు, కేవలం కంపెనీ పునర్వ్యవస్థీకరణ, ఖర్చుల నియంత్రణ కోసమేనని సీఈఓ ఆశా శర్మ ప్రత్యేకంగా పేర్కొన్నారు.

The post మైక్రోసాఫ్ట్ బిగ్ డెసిషన్.. 20% ఉద్యోగులు ఔట్! appeared first on Manalokam – Latest Telugu News & Updates.