July 10, 2026

Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్‌లో BLA-TTP వరస దాడులు..

Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్‌లో BLA-TTP వరస దాడులు..
Reading Time: < 1 minute
Pakistan Security Crisis Bla Ttp Coordinated Attacks Raise Questions Over Asim Munirs Leadership

Pakistan: పాముకు పాలు పోసి పెంచితే ఏమవుతుంది. అది ఏదో రోజు కాటేస్తుంది. సరిగా ఇలాంటి పరిస్థితే పాకిస్తాన్‌కు దాపురించింది. ఇన్నాళ్లు ఏ ఉగ్రవాదంతో భారత్‌ను అస్థిరపరచాలని చూసిందో, ఇప్పుడు అదే ఉగ్రవాదానికి బలవుతోంది. దాయాది దేశంలో వరస దాడుల్లో నాలుగు రోజుల్లోనే 42 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షన్ అసిమ్ మునీర్ దారుణంగా విఫలమయ్యాడని సొంత దేశంలోనే విమర్శలు వస్తున్నాయి. నిజానికి బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో పనిచేయడానికి పాక్ ఆర్మీ వణికిపోతోంది.

జూలై 6 నుంచి 9 వరకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA), తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) సంయుక్తంగా దాడులు చేశాయి. బలూచిస్తాన్‌లోని జియారత్ జిల్లాలోని మంగీ డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని కాపాడుతున్న పోలీస్ అవుట్ పోస్ట్‌పై జరిగిన దాడిలో 27 మంది పోలీసులు, 11 మంది సైనికులు, నలుగురు పౌరులు మరణించినట్లు పాక్ సైన్యం ప్రకటించింది. ఈ దాడి తర్వాత 18 మంది పోలీసుల్ని టీటీపీ అపహరించింది. అనంతరం వీరిని హత్య చేసినట్లు వెల్లడివంచింది. ఇటీవల కాలంలో పాక్‌లో జరిగిన అత్యంత ఘోరమైన దాడుల్లో ఒకటిగా నిలిచింది. ఇదే టైమ్‌లో లస్బేలా జిల్లాలోని బేలా విండర్ ప్రాంతంలోని సైనిక కాన్వాయ్‌పై బీఎల్ఏ దాడి చేసింది. ఇందులో 11 మంది సైనికులు మరణించారు. బీఎల్ఏ 17 మందిని చంపినట్లు పేర్కొంటోంది.

ఇదిలా ఉంటే, ఈ వరస దాడులపై పాక్ మాజీ ఎంపీ బుష్రా గోహర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇంతటి వైఫల్యాలకు ఎవరైనా రాజీనామా చేశారా? అని ఆమె ప్రశ్నించారు. పష్తూన్ ఖ్వా మిల్లీ అవామీ పార్టీ అధ్యక్షుడు మహ్మూద్ ఖాన్ అచక్‌జాయ్ కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనితీరును ప్రశ్నించారు. పాక్ విశ్లేషకుడు హుస్సేన్ నదీమ్ అసిం మునీర్ నాయకత్వంపై పరోక్ష విమర్శలు చేశారు. ‘‘హార్డ్ స్టేట్‌గా చెప్పుకునే దేశం ఇప్పుడు ఫెయిల్డ్ స్టేట్‌లా కనిపిస్తోంది’’ అని అన్నారు.